ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అన్ని రాజకీయ పార్టీలు.. ఉచిత హామీలతో రంగంలోకి దిగుతాయి. తమను గెలిపిస్తే.. చాలు అన్ని ఫ్రీ అని ఊదరగొడతాయి. హామీలిచ్చేముందు.. వాటి సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తాయా లేదా అనే విషయం అర్థం కాదు. ఇక జనాలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకు కావాల్సిన నిధులను తమ వద్ద నుంచే వసూలు చేస్తుందని గ్రహించరు. ప్రతి వ్యక్తికి అవసరమైన విద్య, వైద్యం, ఆహారం, వృద్ధులు, వికలాంగులు, బడుగు, బలహీన వర్గాల వంటి వారిని దృష్టిలో పెట్టుకుని.. వారికి ఉపయోగపడేలా ఉచిత హామీలుంటే ప్రయోజనం చేకూరుతుంది. అంతేతప్ప.. గెలుపే పరమావధిగా.. నోటికి ఏం తోస్తే అది ఉచితంగా ఇస్తామని ప్రకటించడం.. ఆ తర్వాత హామీల అమలు కోసం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయడం వెరసి.. రాష్ట్రాన్ని, దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం.. ఆఖరికి ఆర్థిక మాంద్యం.
ఇప్పటికే పొరుగు దేశాల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా తలకిందులయ్యాయో చూశాం. ఈ క్రమంలో మన దేశంలో ప్రభుత్వాలు ప్రకటించే ఉచిత హామీలపై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు ఇవ్వకుండా నిరోధించాలని కోరుతూ.. ఓ లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఉచితం అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఉచిత తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలను ఉచితాలుగా వర్ణించలేమనిపేర్కొన్నారు. అలానే ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేమన్నారు. ఉచిత వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు.
ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతోందన్న జస్టిస్ ఎన్వీ రమణ అసలు ఉచిత హామీ, సంక్షేమ పథకం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.