నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటంపై బాలీవుడ్ కమెడియన్ సునీల్‌పాల్ స్పందించారు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయటమేకాక రాజ్ ను అరెస్ట్ చేసినందుకుపోలీసులను అభినందించాడు. పోర్నోగ్రఫీ పలు రకాలుగా విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటం ఇప్పుడు సరైన పనే… కానీ అంతకంటే పెద్ద తలకాయలు కొన్ని అడ్డగోలుగా వెబ్ సిరీస్ లు తీస్తున్నాయి. అవి ఇంట్లో వాళ్ళతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయంటూ కామెంట్ చేశాడు.
ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్‌పాయ్ పై విమర్శలు కురిపించాడు. అతడి లాంటి సభ్యతలేని వ్యక్తిని, నీచుడ్ని నేనింత వరకు చూడలేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నవ్యక్తి ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు ? ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఏం చేస్తున్నాడు ? అతను నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో మానవ సంబంధాలు ఎలా ఉంటున్నాయి ?
భార్యకు వివాహేతర సంబంధం… భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం …మైనర్ బాలికకు బాయ్ ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయస్సుకు మించి ప్రవర్తించటం.. ఓ కుటుంబం అలాగే ఉంటుందా ? ఇవా మీరు జనాలకు చూపించేది అంటూ మనోజ్ బాజ్‌పాయ్ పై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తాడు. మరో నటుడు పంకజ్ త్రిపాఠీ నటించిన మీర్జాపూర్ పనికిరాని వెబ్ సిరీస్ అంటూ…… ఇందులో చేసినవాళ్లంటే నాకు అసహ్యం. ఇలాంటి వెబ్ సిరీస్ లను కూడా బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేశాడు.
పోర్న్ అంటే కేవలం కళ్లకు కనిపించేదే కాదు. మనసులను కలుషితం చేసి, ఆలోచనల్ని చెడగొట్టేది కూడా పోర్న్ కిందకే వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా సునీల్ పాల్ 2005 లో ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌లో విజేతగా నిలిచాడు.2010లో భవ్నావో కో సమజో అనే కామెడీ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు.
మనోజ్ బాజ్‌పాయ్ భారతీయ సినిమా నటుడు. ముఖ్యంగా హిందీ సినిమాలలో నటించిన ఇతడు కొన్ని తెలుగు సినిమాలలో కూడా కనిపించాడు. ఇతడు ఒకసారి జాతీయ ఉత్తమ నటుడిగా, రెండుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.