లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి, కోట్లు సంపాదించాలంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటున్నారా? రూ. లక్షతో ఏం సాధించవచ్చు. సాధించేది ఏమీ ఉండదు. మన వల్ల కాదు. కనీసం పది లక్షలైనా ఉంటే అది వ్యాపారం అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ అమ్మాయి కథ చదవండి. కేవలం లక్షతో రూ. 50 కోట్ల వ్యవస్థను నిర్మించిన విధానం తెలిస్తే మీరు మీ అభిప్రాయాన్ని, ఆలోచనా విధానాన్ని మార్చుకుంటారు.
రూ. కోటి జీతంతో ఉద్యోగం వస్తే ఎవరైనా వద్దనుకుంటారా? కానీ ఒక యువతి ఆ ఆఫర్ ను వదులుకున్నారు. ఒకసారి కాదు, రెండు సార్లు వదులుకున్నారు. ఎందుకంటే ఆమెకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగం పొందని వారికి దారి చూపించడం. ఆమె 10 లక్షల మందికి దారి చూపించిన దేవత, ఇవాళ ఈమె దయ వల్ల విదేశాల్లో మంచి ప్యాకేజీతో జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. రూ. లక్షతో కంపెనీ పెట్టి మూడేళ్ళలో దాన్ని రూ. 50 కోట్ల విలువైన సంస్థగా మార్చారంటే ఆమె ఎంత టాలెంటెడో అర్థం చేసుకోవచ్చు. ఆమె పేరు ఆరుషి అగర్వాల్. వయసు 27. స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా. ప్రస్తుతం ఘజియాబాద్ జిల్లాలోని నెహ్రూ నగర్ లో నివసిస్తున్నారు.
చిన్న వయసులోనే కంపెనీ పెట్టి మూడేళ్లలో 50 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగిన మహిళా వ్యవస్థాపకురాలిగా పేరు సంపాదించుకున్నారు. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఈమె ఐఐటీ ఢిల్లీలో ఇంటర్న్షిప్ చేశారు. రెండు సార్లు కోటి రూపాయల ప్యాకేజీతో ఆఫర్ వస్తే ఆమె సున్నితంగా తిరస్కరించారు. సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. లక్ష రూపాయలతో కంపెనీ ప్రారంభించారు. క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవ్వని వారికి సహాయం చేసేలా ఒక సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేశారు. దీని కోసం ఆమె కోడింగ్ నేర్చుకున్నారు. 2020లో కరోనా సమయంలో టాలెంట్ డీక్రిప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఈమె పెట్టుబడిగా రూ. లక్ష పెట్టారు.
గత మూడేళ్ళలో ఈమె సాఫ్ట్ వేర్ వేదిక ద్వారా 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. వీళ్లంతా అమెరికా, జర్మనీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫార్మ్ లో హ్యకథాన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ వర్చువల్ స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేయవచ్చు. ఈ టెస్ట్ లో పాసైతే నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవ్వచ్చు. చాలా యూనివర్సిటీలు ఈ సాఫ్ట్ వేర్ సేవలను పొందుతున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్. మోసం చేసే అవకాశం అస్సలు ఉండదు. స్కిల్ టెస్ట్ సమయంలో ఇతర డివైజ్ లు ఉపయోగించి లేదా ఇతరుల సహాయం తీసుకుని పాసయ్యే అవకాశం ఉండదు. జెన్యూన్ గానే ఉంటుంది.
ఈమె ఐఐఎం బెంగళూరు నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం పూర్తి చేశారు. దేశంలోనే టాప్ వ్యవస్థాపకులలో ఒకరిగా భారత ప్రభుత్వం చేత అవార్డు కూడా పొందారు. నోయిడాలో ఉన్న ఈమె కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈమె తన తాతయ్య ఓం ప్రకాష్ గుప్తాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈమె తండ్రి అజయ్ గుప్తా ఒక వ్యాపారవేత్త మరియు ఈమె తల్లి గృహిణి. మరి రూ. లక్ష రూపాయలతో ఏం చేయగలం? ఏమొస్తుంది? ఏమీ చేయలేము అనుకునే వారికి ఈమెనే ఆదర్శం. తెలివితేటలు ఉంటే ఆ ఒక్క లక్షతోనే రూ. 50 కోట్లు, రూ. 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చునని ఈమె నిరూపించారు. మరి ఈ యువతికి ఒక సెల్యూట్ చేయండి.