ఒక విద్యార్థికి చదువుకోవాలంటే ఏం కావాలి? బడి, పుస్తకాలు, ఉపాధ్యాయులు ఉంటే సరిపోతుంది. కానీ ఒడిశాలోని గంజాం జిల్లా పిల్లలకి ఈత కూడా రావాలి. ఎందుకంటే వారు బడికి వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. ‘ఏటికి ఎదురిదాలి’అన్న సామెత వారికి సరిగ్గా సరిపోతుంది. కింద ఫొటొలో కనిపిస్తున్న విద్యార్ధులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బడికి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం..
ఒడిశాలోని గంజాం జిల్లా పత్రాపూర్ బ్లాక్ లో వంతెన లేకపోవడంతో విద్యార్ధులు రోజూ ఇలా నదిని దాటి వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు ఈ దరి నుంచి ఆ దరికి తాడు కట్టి దాని సాయంతో విద్యార్ధులను నది దాటిస్తున్నారు. ఇది ఒక్క పత్రాపూర్ బ్లాక్ సమస్యే కాదు దాదాపు 15 గ్రామాల ప్రజలు ఈ నదిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
‘వర్షాల కారణంగా నదిలో నీటి ప్రహహాం పెరిగింది. ఇలాంటి సమయంలో పిల్లలు నది దాటడం ప్రమాదకరం. స్థానికుల సహకారంతో వారిని నది దాటించాం. దీంతో పిల్లలందరూ క్షేమంగా వాళ్ల ఇళ్లకు వెళ్లారు. ఇది చాలా ప్రమాదకరమని’స్థానిక నివాసి అయిన రవీంద్ర నాయక్ అన్నారు. చాలా కాలం నుంచే ఈ నది పై వంతెన నిర్మించాలని కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.
ఈ సమస్య గురించి ఒడిశా విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ కు తెలిసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ విషయం గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఇది మీడియా ద్వారానే నాకు తెలిసింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, అధికారులను సమస్య పరిష్కరించాలని ఆదేశించానని’ ఆయన తెలిపారు. ప్రాణాలకు తెగించి బడికి వెళ్తున్న విద్యార్ధులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: వీడియో: లెైవ్ లో కుర్రాడి చెంప పగలగొట్టిన రిపోర్టర్!