ఇటీవల దేశ వ్యాప్తంగా కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటమే కాదు.. చనిపోతున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అంబర్ పేట్ లో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ని కుక్కలు దాడి చేసి చంపాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది.
హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాయి. కుక్కల దాడి ఘటనపై లీగల్ ఓపినియన్ తీసుకుని బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ ఘటనపై ప్రభుత్వం సైతం తీవ్రస్థాయిలో స్పందించి అధికారులను అప్రమత్తం చేసింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కుక్కలు దాడులకు పాల్పపడుతూనే ఉన్నాయి. తల్లి పక్కన పడుకున్న ఓ చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి చంపేశాయి.. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహేంద్ర మీనా అనే వ్యక్తి కొంతకాలంగా సిలికోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. సిరోహి జిల్లాలో ప్రభుత్వ టీబీ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యాడు. అతనితో పాటు భార్యా రేఖ.. పిల్లలు కూడా వచ్చారు. అస్పత్రిలో భర్తకు సహాయం చేస్తూ వస్తుంది రేఖ. నెల రోజుల క్రితమే రేఖ ఒక శిశువుకి జన్మనిచ్చింది. సోమవారం రాత్రి తన పిల్లలను పక్కన వేసుకొని పడుకుంది.. అదే సమయంలో రాత్రి రెండుగంటల ప్రాంతంలో వార్డులోకి రెండు కుక్కలు వచ్చాయి.. అందులో ఒక కుక్క రేఖ పక్కన పడుకున్న నెల రోజుల పసికందును నోట కరుచుకొని ఎత్తుకెళ్లింది. సీసీ కెమెరాలో దీనికి సంబంధించిన దృష్యాలు రికార్డు అయ్యాయి.
రేఖ నిద్ర లేచి చూసేసరికి తన బిడ్డ లేకపోవడంతో చుట్టుపక్కల గాలిస్తున్న సమయంలో ఆస్పత్రి ఆరవణలో చిన్నారి విగతజీవిగా పడిఉంది. కుక్క ఆ పసికందు శరీరభాగాలు ఛిద్రం చేసింది. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితో పసికందును మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ ఘటనపై స్పందించిన చిన్నారి తండ్రి మహేంద్ర తనకు తెలియకుండా తన భార్యతో సంతకాలు తీసుకొని పసికందును ఖననం చేశారని.. వార్డులోకి కుక్కలు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన చిన్నారిని చివరి చూపు చూసుకోలేదని.. జీతాలు తీసుకుంటున్న సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏంచేస్తున్నారని ప్రశ్నించాడు.
ఈ ఘటనపై స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం… సంఘటన జరిగిన సమయంలో టీబీ వార్డులో సిబ్బంది లేరని.. అదే సమయానికి కుక్కలు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని అన్నారు. మెడికల్ బోర్డు ద్వారా చిన్నాకికి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు.