సాధారణంగా రైలు ప్రయాణికులు టికెట్ తీసుకోవాలంటే చాలా అవస్థలు పడుతుంటారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులు టిక్కెట్ కోసం గంటల తరబడి కౌంటర్ లో నిల్చోవాలి. కొన్ని సార్లు టికెట్ తీసుకునే లోపు ట్రైన్ బయదేరి వెళ్తుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ను అమలులోకి తెచ్చింది.
సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు టికెట్ కోసం క్యూ లైన్ లో నిల్చునే సమస్యకు చెక్ పెట్టి డిజిటల్ వినియోగం పెంపునకు వీలుగా ATVMలో క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ పొందే సౌకర్యం కల్పించారు. ATVMలో ప్రయాణానికి సంబంధించిన వివరాలు నమోదు చేసి.. టికెట్ ఛార్జీ చెల్లింపునకు ప్రస్తుతం ఉన్న చెల్లింపుల సదుపాయాలకు అదనంగా పేటీఎం, యూపీఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒక దానికి ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం ప్రయాణికుల మిషన్ స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్ లో స్కాన్ చేసి టికెట్ ఛార్జీలు చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ పూరైయిన తర్వాత ATVM ద్వారా టికెట్ వస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ తెలిపారు.
గతంలో అన్ రిజర్వ్డ్ టికెట్ పొందాలంటే నగదుతో కూడిన స్మార్ట్ కార్డు ద్వారా చెల్లించేవారు. ఈ స్మార్ట్ కార్డులను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. దీనికి కూడా ఆన్ లైన్ పద్ధతి లేదా జనరల్ బుకింగ్ కౌంటర్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఈ సదుపాయానికి అదనంగా పేటీఎం, యూపీఐ ఆప్షన్ల ను అందుబాటులోకి తెచ్చారు. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరి. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.