ఆధార్ కార్డుకు సంబంధించి ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే గనుక వేలిముద్రల వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్ కేంద్రంలో ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద వేలు పెట్టాల్సిందే. అయితే ఒక్కోసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ సరిగా పనిచేయదు. ఎంత ప్రయత్నించినా వేలిముద్రలు పడవు. ఇలాంటప్పుడు విసుగు వస్తుంది. దీనికి పరిష్కారంగా ఇంట్లో నుంచే బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసుకునే సౌకర్యాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తుంది.
ఆధార్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో యూఐడీఏఐ సంస్థ ఆధార్ లో టచ్ లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ సమయంలో అయినా ఆధార్ కార్డు కోసం బయోమెట్రిక్ వేయచ్చునని తెలిపింది. వేలి ముద్రలు, ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ స్కాన్ ద్వారా బయోమెట్రిక్ వేసుకునే సౌకర్యాన్ని డెవలప్ చేస్తోంది. దీని కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో (ఐఐటీ బాంబే) ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా వేలిముద్రల కోసం మొబైల్ క్యాప్చర్ సిస్టమ్ ను, అదే విధంగా క్యాప్చర్ సిస్టమ్ తో లివ్ నెస్ మోడల్ ఇంటిగ్రేటెడ్ సాంకేతికతపై ఆధార్ సంస్థ, ఐఐటీ బాంబే సంయుక్తంగా పరిశోధనలు చేయనున్నాయి.
టచ్ లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ ఒకసారి డెవలప్ అవ్వడం, అందుబాటులోకి రావడం జరిగితే గనుక.. ఫేస్ అథెంటికేషన్ లానే ఇంట్లోనే కూర్చుని వేలిముద్ర అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ టచ్ లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ అమలైతే గనుక ఈ ఆపరేషన్ వేలిముద్రలు, ఫేస్ అథెంటికేషన్ కు అనుమతిస్తుంది. ఈ కొత్త సిస్టమ్ ఒకేసారి అధిక వేలిముద్రలను క్యాప్చర్ చేయగలదని, అథెంటికేషన్ సక్సెస్ రేటులో ఇది దోహదపడుతుందని యూఐడీఏఐ తెలిపింది. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలకు ఇది అదనంగా ఉంటుందని తెలిపింది.
సిగ్నల్ ప్రాసెసింగ్ లేదా ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పని చేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవలను మొబైల్ ద్వారా అందించడంలో మరింత సులభతరం చేస్తుందని ప్రకటనలో పేర్కొంది. నిజమైన లాబీదరులను గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్ కు సమానంగా ఫింగర్ ప్రింట్ విధానం పని చేస్తుందని, ఇది అమలులోకి వస్తే ఆధార్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపింది. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, రిలేషన్ షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటివి అప్డేట్ చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆధార్ లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 7 నుంచి 8 కోట్ల మంది అప్లై చేసుకుంటున్నారు.
సగటున రోజుకు 7 కోట్ల మంది ఆధార్ లో మార్పులు చేయించుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. ఈ మొబైల్ కాప్చర్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే వేలిముద్రల బయోమెట్రిక్ కోసం మన స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. ఏ షాప్ కైనా వెళ్ళినప్పుడు ఒక వస్తువును ఈఎంఐలో కొన్నప్పుడు గానీ సిమ్ కార్డు తీసుకున్నప్పుడు గానీ ఖచ్చితంగా వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ లు మొరాయిస్తాయి. కొంతమంది దుర్వినియోగం కూడా చేస్తారు. ఇక శుభ్రంగా ఉండేవారికి కూడా వారి ఫోన్ ద్వారా వేలిముద్రలు వేయడం ద్వారా వారికి అబ్బా సాయిరాం అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి వచ్చాక చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. మరి యూఐడీఏఐ తీసుకొస్తున్న ఈ సరికొత్త విధానంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.