వయసు మీదపడిన తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు సాగనంపే తనయులు ఉన్న ఈ దేశంలో తండ్రికో ఏ త్యాగానికైని సిద్దపడే తనయులు కూడా ఉన్నారు. నవమాసాలు మోసి మనకు జన్మనిస్తుంది తల్లి. తన పిల్లలు సంతోషంగా ఉండాలి.. ఉన్నత చదువు చదవి సమాజంలో గొప్ప పొజీషన్ లో కనిపించాలని తండ్రి పడే ఆరాటం అంతా ఇంతా కాదు.. పిల్లల కోసం తన జీవితాన్ని అర్పించే తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే..
ఆ యువకుడికి తండ్రి అంటే ఎంతో అభిమానం.. ప్రేమ. చిన్నప్పటి నుంచి కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకు తండ్రి తనయుడి పెళ్లి చూడాలని ఎంతో ఆశపడేవాడు. కానీ విధి వైపరిత్యం.. కుమారుడి వివాహం జరగకముందే.. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపోవడం ఆ తనయుడికి తీరని వేదన మిగిల్చింది. పెళ్లికి వారం రోజుల ముందే తండ్రి చనిపోవడంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తనయుడు తన తండ్రిపై ప్రేమను ఎంతో గొప్ప మనసుతో చాటుకున్నాడు.. తండ్రి కోరికను ఎలాగైనా తీర్చాలని భావించాడు. పెళ్లి కూతురుని ఒప్పించి తండ్రి భౌతికకాయం ముందు పెళ్లి చేసుకున్నారు. గుండెల్ని పిండేసే ఈ సంఘటన తమిళనాడులోని కళ్లక్కురిచ్చిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కళ్లక్కురిచ్చి.. పెరువంగూరు గ్రామానికి చెందిన అయ్యామ్మాళ్, రాజేంద్రన్ తనయుడు ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం అయ్యామ్మాళ్ పెరువంగూరు గ్రామానికి పంచాయతీ యూనియన్ అద్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఇటీవల వీరి తనయుడు ప్రవీణ్ కుమార్ వివాహం నిశ్చయమైంది. తనయుడి పెళ్లి వేడుకలకు అన్నీ సిద్దం చేస్తున్నారు. తన కొడుకు పెళ్లి నిశ్చయం కాగానే తండ్రి రాజేంద్రన్ ఎంతో ఆనందంలో ఉన్నాడు. ఈ నెల 27 న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. విధి వైపరిత్యం తనయుడి పెళ్లి కళ్లారా చూడాలని భావించిన రాజేంద్రన్ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పెళ్లి కొద్దిరోజుల ముందే తండ్రి చనిపోవడంతో ప్రవీణ్ కుమార్ తట్టుకోలేకపోయాడు.. కన్నీరు మున్నీరు అయ్యాడు. నాన్నపై ఉన్న ప్రేమతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు ప్రవీణ్ కుమార్. తన తండ్రి బౌతికకాయం ముందే పెళ్లి చేసుకోవాలని వధువు స్వర్ణమాలను ఒప్పించాడు. దానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. వధూవరులు పెళ్లి దుస్తుల్లో వెళ్లి రాజేంద్రన్ భౌతికకాయం ఎదుటే పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆయన భౌతికకాయానికి నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. గుండెల్ని పిండేసే ఆ దృశ్యం చూసి అందరూ కన్నీరు పెట్టుకున్నారు. తండ్రి పై ఎంత గొప్ప ప్రేమ అంటూ అని ప్రవీణ్ కుమార్ ని ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.