సాధారణంగా పాములంటే అందరికి భయమే. అవి అంటే మనకు ఎంత భయమో అంతే స్థాయిలో మనం అంటే వాటికీ భయమే. అడవుల్లో, పొలాల్లో ఉండాల్సి పాములు అప్పుడప్పుడు బస్సు, బైక్ లో ప్రత్యక్షమై అందరిని భయ పెడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటి కారణంగా ప్రయాణాలు సైతం ఆలస్యమవుతుంటాయి. తాజాగా తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లతున్న నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాముల కలకలం సృష్టించించిది. అది కూడా రాత్రి సమయంలో కనిపించడంతో రైల్లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో దాన్ని వెతికి పట్టుకునేందుకు అధికారులు గంటకుపైగా రైలును నిలిపివేశారు. ఈ ఘటన కేరళ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
కేరళ లోని తిరువనంతపురం నుంచి బుధవారం రాత్రి నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీకి బయల్దేరింది. ఈ క్రమంలో తిరూర్ స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికి S-5 బోగీలో బెర్తు కింద లగేజీ మధ్యలో పామును ప్రయాణికులు గుర్తించారు. వెంటనే టీటీఈకి తెలియజేశారు. ఆయన అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును తదుపరి స్టేషన్ అయిన కోజికోడ్‌లో నిలిపివేశారు. అనంతరం ఆ బోగీలోని ప్రయాణికులందరినీ దింపి పాములు పట్టేవారికి సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఆ బోగీలో ఎంత వెతికిన పాము జాడ కనిపించలేదు. దీంతో అసలు అది ఏలాంటి పాము అని గుర్తించే ప్రయత్నం చేశారు.
ప్రయాణికులు ఫోన్లలో తీసిన ఫొటోలను పరిశీలించిన తర్వాత అది విషపూరితం కాని సర్పమన్న నిర్ధరణకు వచ్చారు. రైలు నుంచి అది వెళ్లిపోయి ఉంటుందని, లేదా బోగీ పక్కన ఉన్న ఓ రంధ్రంలోకి వెళ్లి ఉండొచ్చని భావించి.. ఆ రంధ్రాన్ని మూసివేశారు. అనంతరం రైలు కోజికోడ్ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరి.. రైల్లో పాము కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.