మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. మేఘాలయలోని తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు అర్దరాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ఈ బస్సులో 21 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12 గంటల సంమయంలో నాంగ్‌చ్రామ్ వద్ద అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ బ్రిడ్జి రింగ్దీ నదిపై ఈస్ట్ గారో హిల్స్, వెస్ట్ కాశీ హిల్స్ జిల్లా మధ్య ఉన్నదని, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని, మరో రెండు మృతదేహాల కోసం గాలిస్తున్నామని వారు పేర్కొన్నారు. మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సు చాలా వేగంగా వెళుతుందని, దీంతోనే బస్సు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టి నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.