ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే మొదలైందో మనుషులకు ప్రాణ భయం పట్టుకుంది. కరోనాని కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మన దేశంలో రెండు పర్యాయాలు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో తమ ఆత్మీయులు కంటి ముందే ప్రాణాలు వదిలేస్తుంటే చాలా మంది మానసికంగా కృంగిపోయారు. దేశంలో ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.
తాజాగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనే భయంతో కాన్పూర్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తన కుటుంబాన్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. ‘ఇంకా మృతదేహాలను లెక్కించే ఓపిక లేదు. ఒమిక్రాన్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అందుకే నా కుటుంబానికి విముక్తి ప్రసాదించాను..’ అంటూ తన సోదరుడికి వాట్సాప్ మెసేజ్ పెట్టిమరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ప్రొఫెసర్.
పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్ సిటీలోని కల్యాణ్ పూర్ ఏరియాలో నివసించే సుశీల్ సింగ్ స్థానికంగా ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అతనికి చంద్రప్రభ భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఈ మద్య కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తీవ్ర రూపం దాల్చుతుందని.. తన కుటుంబానికి ఈ వైరస్ సోకిందనే భయంతో భార్యను గొంతు నులిమి చంపేసి, మైనర్లయిన కూతురు, కొడుకులపై సుత్తితో దాడి చేసి, వారి పుర్రెలను పగలగొట్టి చంపేశాడు.
ఈ విషయం తన సోదరుడికి వాట్సాప్ ద్వారా తెలియజేసాడు నింధితుడు. వెంటనే నిందితుడి సోదరుడు ఘటనా స్థలికి చేరుకున్నాడు. ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూడగా లోపల ప్రొఫెసర్ భార్య,కూతురు, కుమారుడి మృతదేహాలు కనిపించాయి. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో డిప్రెషన్‌లో ఓసారి తన భార్యపై హత్యాయత్నం చేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. ప్రొఫెసర్‌ను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.