దేశంలో పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెట్రోల్ ధరలు భరించలేక లబోదిబోమంటున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించారు. సోమవారం(ఏప్రిల్ 25) స్థానిక శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయక్ పుట్టినరోజు కావడంతో.. అక్కడి శివసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ చేపట్టారు. థానేలోని తత్వజ్ఞాన్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న కైలాష్ పెట్రోల్ బంక్‌లో ఈ పంపిణీ జరిగింది.
రూ.1కే లీటర్ పెట్రోల్ అని తెలియడంతో భారీ ఎత్తున వాహనదారులు అక్కడకు చేరుకున్నారు. థానే మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కార్పోరేటర్ ఆశా డోంగ్రే, సామాజిక కార్యకర్త సందీప్ డోంగ్రే, అబ్దుల్ సలాం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయక్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, పెరిగిన పెట్రోల్ ధరలపై నిరసన తెలిపేందుకు ఇలా రూపాయికే పెట్రోల్ పంపిణీ చేపట్టినట్లు వీరు తెలిపారు. దాదాపు 1000 మంది వాహనదారులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: 28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్దోషిగా తేల్చిన కోర్టు.. ఇప్పుడతని పరిస్థితి ఏంటి!
ఇటీవల.. మహారాష్ట్రలోని సోలాపూర్‌లోనూ రూ.1కే లీటర్ పెట్రోల్‌ను ఓ పెట్రోల్ బంకు లో విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ స్టూడెంట్స్ అండ్ యూత్ పాంథర్స్ ఆధ్వర్యంలో ఈ రూ.1కేపెట్రోల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.