నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు షేర్ బహదూర్ డ్యూబా. అనూహ్యపరిణామాల మధ్య ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఖాట్మాండులోని ఆ దేశ పార్లమెంట్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన విజయం సాదించారు. నేపాల్ కోర్టు ఆదేశాల అనంతరం ఈ నెల 12న నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ డ్యూబాను ప్రధానిగా నియమితులయ్యారు. మొత్తం 275ఓట్లలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 136ఓట్లు సాధించాల్సి ఉంది. ఇక ఈ ఓటింగ్‌లో షేర్ బహదూర్ డ్యూబా 165 ఓట్లను గెలుచుకోగా 83 ఓట్లు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా రావటం విశేషం.
ఈ ఓటింగ్‌లో ప్రధానంగా మొత్తం 249 మంది ఎంపీలు పాల్గొన్నారు. నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్, జనతా సమాజ్ వాదీ పార్టీ-నేపాల్ ఎంపీలు డ్యూబాకు అనుకూలంగా ఓటు వేశారు. ఇక గతంలో షేర్ బహదూర్ డ్యూబా నేపాల్ ప్రధానిగా నాలుగుసార్లు పని చేశారు. ఈ సందర్బంగా ప్రధానిగా ఎన్నికైన షేర్ బహదూర్ డ్యూబాకు భారత ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అన్ని రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మోడీ. దీంతో పాటు ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అన్ని విషయాల్లో సహకరిస్తామని
ట్విట్టర్ లో తెలిపారు.