తమిళ హీరో ధనుష్ ఇటీవల నటించిన 'సార్' మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో అసలు పాఠశాలకు రాని విద్యార్థులను ఓ లెక్చరర్ ఏ విధంగా రప్పించాడో, వారి విజయానికి ఎలా కృషి చేశారో దర్శకుడు అద్భుతంగా చూపించాడు. అలాంటి సార్ నిజజీవితంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో కృపాశంకర్ మాస్టార్ ఒకరు.
గురువులు అంటే విద్యార్థులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే వారు. విద్యార్థులను మంచి మార్గంలో నడిపించేందుకు ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తుంటారు. అలానే తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ నలుగురికి ఆదర్శంగా ఉంటారు. వీరందరికి మించి మరికొందరు ఉపాధ్యాయులు ఉంటారు. తమ సొంత డబ్బులను పిల్లల కోసం, పాఠశాల కోసం ఖర్చు చేస్తుంటారు. అలాంటి ఉపాధ్యాయుల మంచి మనసుకు విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు ఫిదా అవుతారు. తాజాగా ఓ ప్రధానోపాధ్యాయుడు.. తన సొంత జీతంతో ప్రభుత్వ పాఠశాలకు కొత్త హంగులు అద్దారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టిన స్థానిక చిన్నారులను.. ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తున్నారు. మరి.. ఆ మనస్సున మాస్టార్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లా చిఖ్ లాడీ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో కృపాశంకర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. ఆయన 2012లో ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా చేరిన ఆయన ప్రస్తుతం ప్రధాన అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని విద్యార్ధులు చదువు పట్ల ఆసక్తి చూపడం లేదని కృపాశంకర్ గ్రహించారు. అక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులో మార్పు తేవాలని ఆయన భావించారు. అలానే ప్రైవేటు స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులను కూడా ప్రభుత్వ బడివైపు వచ్చేలా చేయాలని నిశ్చయించుకున్నారు. ముందుగా పిల్లలను పాఠశాలకు ఆకర్షితులయ్యేలా చేస్తే సగం విజయం సాధించినట్లు ఆయన భావించారు.
అందుకే పిల్లలు ప్రభుత్వ బడిని ఆకర్శించేలా రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. తన సొంత డబ్బులతో సర్కారు బడి అభివృద్ధికి పాటుపడ్డారు. తన ఒక రోజు జీతం రూ.3 వేల చోప్పున ఏడాదికి 12 రోజుల వేతాన్ని స్కూల్ కోసం ఖర్చు చేశారు. అలానే ఇంకా ప్రభుత్వ బడి కోసం ఆయన ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నారు. తాను తీసిన డబ్బులతో పాఠశాలలో సుందరీకరణ పనులు చేపట్టారు. ప్రత్యేకమైన మెటీరియల్ ను తయారు చేయించి.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో పాఠాలకు సంబంధించిన వివిధ ఆకృతులను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న బంతులను ఉపయోగించి.. లెక్కలు నేర్పిస్తున్నారు. అలానే వివిధ రకాల బొమ్మలను, వస్తువులను తెప్పించి.. విద్యార్థలకు పాఠాలు బోధిస్తున్నారు.
చదువంటే కష్టం కాదు.. ఇష్టం అనేలా నేర్పిస్తున్నారు. ఆయన పాఠశాలకు వచ్చిన కొత్తలు కొందరి పిల్లలు మాత్రమే ఉన్నారు. నేడు విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆ ప్రధానోపాధ్యాయుడి కృషిని, మంచి మనస్సును గ్రామస్థులు కూడా గుర్తించారు. గతంలో ప్రైవేటు పాఠశాలకు పంపుతున్న తమ చిన్నారులను.. అక్కడ మాన్పించి.. కృపా శంకర్ సార్ పనిచేస్తున్న పాఠశాలకు పంపుతున్నారు. మరి.. ఇలాంటి మంచి మనసున్న ‘సార్’పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.