అబార్షన్ల విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రతీ మహిళకు అబార్షన్ ఎంచుకునే హక్కు తీర్పు ఇచ్చింది. సురక్షితమైన, చట్టబద్దమైన అబార్షన్ విధానానికి మహిళలంతా అర్హులని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులనే తేడా చూపడం అనేది రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ(MTP)చట్టం ప్రకారం రేప్ నిర్వచనంలో వైవాహిక అత్యాచారం కూడా ఉంటుందని కోర్టు తీర్పు వెల్లడించింది.
ఇంకా సుప్రీం కోర్టు.. తమ తీర్పులో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఎంపీటీ చట్ట ప్రకారం పెళ్లి కాని మహిళకు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉంది. అయితే భారతదేశంలో అబార్షన చట్టం ప్రకారం మహిళల మధ్య ఎటువంటి భేదం చూపదు. 20 నుంచి 24 వారాల గర్భంతో ఉన్న ఒంటరి లేదా అవివాహిత గర్భిణీలను అబార్షన్ కు అనుమతించకుండా నిషేధించడం, కేవలం వివాహిత మహిళలను అనుమతించడం అనేది ఆర్టికల్-14 మార్గనిర్దేశక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది” అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. చట్టం ఎప్పుడూ స్థిరంగా ఉండకూడదని, మారుతున్న సామాజిక వాస్తవాలను కూడా పరిగణనలోకి కూడా తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎంటీపీ యాక్ట్ ప్రకారం అత్యాచార బాధితులు,మైనర్లు, వివాహితులు, మానసిక సమస్యలతో ఉన్నవారు, పిండం సరిగ్గా అభివృద్ధి చెందని సందర్భాల్లో మహిళలు 24 వారాల వరకు గర్భ స్రావాలు చేయించుకునేందుకు అనుమతి ఉంది.
పెళ్లి కాని మహిళలు తమ సమ్మతితో గర్బం దాలిస్తే.. అప్పుడు 20 వారాల వరకు మాత్రమే అబార్షన్ చేయించుకునే వీలుంది. తాజా తీర్పుతో ఇప్పుడు పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ గర్భం దాల్చిన 24 వారాలలోపు అబార్షన్ చేయించుకోవచ్చు. పోస్కో యాక్ట్ ప్రకారం ఎవరైన అబార్షన్ కోసం వెళ్తే.. రిజిస్టర్డ్ మెడికల్ పిటిషనర్లుకి మైనర్.. తన యొక్క వ్యక్తిగత గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎంటీపీ మైనర్‌లకు దూరం చేయడం చట్టం ఉద్దేశం కాదని, సదరు మహిళ ఉన్న సామాజిక పరిస్థితులు ఆమె అబార్షన్ రద్దు నిర్ణయంపై ప్రభావం చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది.