ఈ మధ్య సహజీవనం అన్న కాన్సెప్ట్ భారత్ లో బాగా డెవలప్ అయ్యింది. అయితే పెళ్ళికి రిజిస్ట్రేషన్ ఉన్నట్టే సహజీవనానికి కూడా రిజిస్ట్రేషన్ ఉండాలంటూ ఓ న్యాయవాది పిటిషన్ వేశారు.
సహజీవనం ఇదొక ట్రెండ్ అయిపోయింది. పెళ్లి కాకుండానే కాపురాలు పెట్టేసే జంటలు ఎన్నో ఉన్నాయి. కలిసి ఏడడుగులు వేయకపోయినా, మెడలో తాళిబొట్టు లేకపోయినా, నెత్తి మీద జీలకర్ర, బెల్లం పెట్టుకోకపోయినా పెళ్లి తర్వాత జరిగే కార్యంతో అనధికారిక భార్యాభర్తలు అయిపోతున్నారు కొంతమంది. వేరే మకాం పెట్టేసి భార్యాభర్తల్లా ఉంటున్నారు. అయితే ఇలాంటి జంటలకు కూడా ఒక గుర్తింపు ఏడిస్తే బాగుంటుందన్న ఆలోచన ఒక లాయర్ కు వచ్చింది. దేశంలో సహజీవనం చేసే జంటలకు కూడా రిజిస్ట్రేషన్ ఉంటే బాగుంటుందని ఒక న్యాయవాది ఆలోచించాడు. ఇందుకోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సహజీవనం చేసే జంట తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ ఓ న్యాయవాది పిటిషన్ వేశారు.
సహజీవనం వల్ల నేరాలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమించినవాడు ఎలాంటి వాడో తెలియదు. సహజీవనం మోజులో కలిసి ఉన్నన్ని రోజులు ఉండి.. మోజు తీరిపోయాక అమ్మాయిల గొంతులు కోసేస్తున్నారు. ఇలాంటి నేరాలు జరక్కుండా ఉండాలంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉండాలని.. దాంతో పాటు వారికి ప్రభుత్వమే మార్గదర్శకాలు చేయాలని ఆలోచించిన న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదొక మూర్ఖపు ఆలోచన అంటూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, రిలేషన్ షిప్ లో ఉండే ప్రతీ జంట తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలానే సహజీవనంలో ఉన్న జంటలకు సామాజిక భద్రత కల్పించాలని ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఆలోచన ద్వారా సహజీవనంలో జరిగే నేరాల సంఖ్య తగ్గుతుందని సదరు న్యాయవాది అభిప్రాయపడ్డారు.
అయితే ఈ పిటిషన్ ను విచారించిన సీజేఐ జస్టిస్ దేవై చంద్రచూడ్ న్యాయవాదిపై మండిపడ్డారు. ఎలాంటివి పడితే అలాంటి విషయాలతో కోర్టుకి వస్తున్నారని, ఇక నుంచి ఇలాంటివి కోర్టు దృష్టికి తీసుకొస్తే జరిమానా విధించడం మొదలుపెడతామని హెచ్చరించారు. సహజీవనానికి రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీవనంలో ఉన్న జంటలతో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని రిజిస్ట్రేషన్ కావాలంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశంతో పిటిషన్ వేశారని సదరు న్యాయవాదిని ప్రశ్నించగా.. సామాజిక భద్రత అని సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన, వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలూకా నేరాలు వెలుగులోకి రావడంతో కేంద్రం తరపున సహజీవనం కోసం రిజిస్ట్రేషన్, మార్గదర్శకాల కోసం తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అయితే న్యాయవాది పై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పిటిషన్ యూ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి సహజీవనానికి ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్ ఉండాలన్న న్యాయవాది ఉద్దేశం కరెక్టా? లేక ఇదొక మూర్ఖపు ఆలోచన అని పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఉద్దేశం కరెక్టా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.