సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. దయ, కరుణ, ప్రేమ, అహింస, మానవ ప్రేమే భారతీయులకు ముఖ్యమన్న మాటలు వినపడుతుంటాయి. అందులోనూ తెలుగువారికి మానవతా విలువలు ఎక్కువన్న పేరు ఉంది. కానీ, చూద్దామంటే ఇసుమంతైనా ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఈ వార్త చదివాక మనుషుల్లో మానవత్వం ఎప్పుడో చనిపోయిందని అనిపించక మానదు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన ఈడే సాములు, అతని భార్య ఈడే గురు పని నిమిత్తం విశాఖపట్నం వలస వచ్చారు. అక్కడే కూలీ.. నాలీ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో సాములు భార్య అనారోగ్యం బారిన పడింది.
వెంటనే భర్త సాములు, ఆమెను చికిత్స నిమిత్తం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఆమె చికిత్సకు స్పందించడం లేదని, బ్రతకడం కష్టమని.. తిరిగి సొంతూరు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేది ఏమీ లేక సాములు భార్యను తీసుకొని, ఆటోలో విజయనగరం వస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మరణించింది. ఈ విషయం తెలిసిన ఆటో డ్రైవర్ వారిని రోడ్డుమీదనే దించేసి వెళ్లిపోయారు. పోనీ, వేరే వారి సాయం అడిగినా సహకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా అతడు మాట్లాడే భాష ఒడియా కావడంతో ఎవరికి అర్థం కాక అతనిని పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో మరోదారిలేక సాములు తన భార్య శవాన్ని భుజం మీద వేసుకొని, కాలి నడకన ఒడిశా దిశగా అడుగులు వేశాడు.
భార్య చనిపోయిన దుఃఖాన్ని గుండెలో దిగమింగుకుని.. ఆమె శవాన్ని భుజంపై మోసుకుంటూ వెళ్తున్న అతడిని పోయేవారు, వచ్చేవారు చూస్తున్నారు కానీ, పట్టించుకోలేదట. అయితే, ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆపన్నహస్తం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లగా, భార్య శవాన్ని భుజాన వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్న సాములు వారికి తారసపడ్డాడు. అనంతరం అసలు విషయం తెలుసుకున్న పోలీసులు, ఒడిశా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేసి అతన్ని పంపించారు. అయితే.. భార్య శవాన్ని భుజంపై మోసుకెళ్తున్న అతనికి కాసింత సహాయం కూడా చేయని తెలుగు ప్రజలపై విమర్శలు వెల్లువెతున్నాయి. ఇదేనా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తీరు అంటూ తోటి తెలుగువారే ప్రశ్నిస్తున్నారు. ఈ విషాద ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.