ఎంతో పేదరికంలో ఉన్నవారు.. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి అదృష్టం తలుపు తట్టినా.. దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది.
మనిషి ఉదయం లేచిన మొదలు కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి. సాధారణంగా కూలీ పనులు చేసుకునేవారు రోజంతా కష్టపడితే కాని సాయంత్రానికి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కాయ కష్టం చేసుకుని బ్రతుకును ఈడుస్తున్న పేదవారికి అనుకోకుండా కోట్ల రూపాయలు కలిసి వచ్చాయంటే ఆశ్చర్యమేకదా! రాత్రికి రాత్రే ఓ దినసరి కూలీ కోటీశ్వరుడైన వైనం బెంగాల్ లో జరిగింది. అసలు వివరాలలోకి వెళితే..
మహ్మద్ నసీరుల్లా ఓ వ్యవసాయ కూలీ. ఆయన బెంగాల్ దేగంగాలోని వాసుదేవపూర్ లో నివాసముంటున్నాడు. అతనికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో అప్పుడప్పుడు బ్యాంక్ లావాదేవీలు జరిపేవాడు. కానీ వేల డబ్బులు ఒక్కసారిగా లావాదేవీలు జరపలేదు. అలాంటిది తాజాగా అతని అకౌంట్ లో అనుకోకుండా రూ.100 కోట్లు జమ అయినట్లు గమనించాడు. తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు నసీరుల్లాకు నోటీసులు పంపారు. మే 30 లోగా తన అకౌంట్లో ఉన్న డబ్బుకు సంబంధించిన ప్రూఫ్ పేపర్స్ సమర్పించాలంటూ నోటీసుల్లో తెలిపారు. దీంతో నసీరుల్లా బ్యాంక్ కు వెళ్లి తన అకౌంట్లోకి రూ.100 కోట్లు ఎలా వచ్చాయో తెలియదని బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ ను బ్లాక్ చేశారు.
గత ఏడాది మేలో కూడా ఇటువంటి ఘటననే చెన్నైలో జరిగింది. టీ నగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 100 మందికి వారి అకౌంట్లో రూ.13 కోట్లు జమ అయ్యాయి. కొందరు తన అకౌంట్లో డబ్బులు వచ్చిన విషయాన్నిబ్యాంక్ అధికారులకు తెలియజేశారు. అయితే ఇంతపెద్ద నగదు ఎలా బదిలీ అయ్యిందో విచారణ చేపట్టారు. సాంకేతిక లోపం కారణాల వల్ల జరిగిందా? లేక ఇంటర్నెట్ సర్వీస్ లో ఏదైనా ప్రాబ్లమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు నుండి ఎలాంటి వివరణ రాకపోవడం గమనించదగ్గ విషయం.