ఎడ్లబండి.. ఇది ఒకప్పటి రైతు రథం. కాలుష్యం అంటే ఏంటో తెలియని రోజుల్లో పచ్చని పల్లెటూర్లలో ఈ రథం కళకళలాడుతూ తిరిగేది. పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, పండగలైనా, జాతరైనా, సినిమాలైనా.. వేడుక ఏదైనా గానీ దొడ్లో ఉన్న ఎద్దులు బయటకు రావాల్సిందే. బండికి చిడతలు పెట్టాల్సిందే, ఎద్దులని కట్టాల్సిందే, పొరుగూరికి పోవాల్సిందే. అదీ ముచ్చట.
ఇప్పుడు ఈ ముచ్చట లేదు గానీ అక్కడక్కడా కొన్ని మారుమూల గ్రామాల్లో ఎడ్లబండ్లయితే ఉన్నాయి. ఇప్పటికీ పండిన పంటను ఎడ్లబండి మీదే తరలించే వేలాది మంది రైతులు ఉన్నారు. ఎంత పొగ బండ్లొచ్చి, ఎడ్లబండ్లకి పొగబెట్టినా ఎడ్లబండ్ల జాడయితే పోలేదు.
సరే ఈ ముచ్చట పక్కన పెడితే.. ఎడ్లబండి మీద భారీగా ధాన్యం బస్తాల లోడో, ఇతర పంటల లోడో వేసి.. ఒక ఊరి నుండి వేరే ఊరికి తోలతా ఉంటారు. ఆ సమయంలో ఆ ఎద్దులు పడే బాధ వర్ణనాతీతం. ఎద్దులని అలా చూసినప్పుడు ఎవరికైనా ప్రాణం చివుక్కుమంటుంది. ఆ తర్వాత కర్మ అని లైట్ తీసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం అలా లైట్ తీసుకోలేకపోయారు. ఏదో ఒకటి చేసి ఎద్దుల భారాన్ని తగ్గించాలనుకున్నారు. మొత్తానికి ఆలోచించి ఒక అద్భుతమైన ఆవిష్కరణను కనిపెట్టారు.
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. కానీ ఇక్కడ ఓ ఐడియా ఎద్దుల జీవితాన్ని ఆల్మోస్ట్ మార్చే పని చేసింది. వాటి కష్టాన్ని చాలా వరకూ తగ్గించే పని చేసింది. ఆ ఐడియా మరెవరిదో కాదు, మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులది. ఇస్లాంపూర్ కు చెందిన కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎద్దుల కష్టం చూసి చలించిపోయారు. సంగ్లీ జిల్లా, ఇస్లాంపూర్ లోని ఆర్ఐటీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న సౌరభ్ భోస్లే, ఆకాశ్ కదం, నిఖిల్ తిపాయలే, ఆకాశ్ గైక్వాడ్, ఓంకార్ మిరజ్కర్ లు ఎద్దులు పడే బాధ చూడలేక ఒక అద్భుతమైన ఆలోచన చేశారు.
మహారాష్ట్రలో 200 వరకూ పంచదార పరిశ్రమలు ఉన్నాయి. సమీప గ్రామాల రైతులు చెరకు లోడ్ ను పరిశ్రమలకు తీసుకెళ్లాలంటే వందలాదిగా ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తారు. కాలేజీకి వెళ్లే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఎద్దులు.. బండి బరువును లాగలేక అవి పడే ఇబ్బందులను తరచూ చూసేవారు.
ఇదే విషయం తమ కాలేజీ ప్రొఫెసర్ సుప్రియతో చెప్పి తమ ఆలోచనను ఆమెతో పంచుకున్నారు. ఆమె సూచనలతో ఎడ్లపై పడే బండి భారాన్ని తగ్గించే పరికరాన్ని తయారుచేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుకు “సారథి” అనే పేరు పెట్టి.. ‘థర్డ్ రోలింగ్ సపోర్టర్’ అనే పరికరాన్ని తయారుచేశారు.
విమానానికి ముందు భాగంలో ఉండే చక్రం మాదిరి.. ఎద్దులబండికి సపోర్ట్ గా ఈ పరికరాన్ని తయారుచేశారు. ఎద్దులబండికి ముందు భాగంలో ఎద్దుల మధ్యలో ఈ పరికరాన్ని అమరుస్తారు. దీని వల్ల ఎడ్లపై భారం పడకుండా ఎద్దులబండిని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తుంది. బండి కూడా సులువుగా ముందుకు కదులుతుంది.
అంతేకాదు, ఎద్దుల హైట్ కి తగ్గట్టు ఈ రోలింగ్ సపోర్ట్ ను పైకి, కిందకి అడ్జస్ట్ చేసుకునే వీలు కల్పించారు విద్యార్థులు. లోడ్ వేసినప్పుడు, లోడ్ ని తీసుకెళ్తున్నప్పుడు కూడా రోలింగ్ సపోర్ట్ అడ్జస్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సరికొత్త రోలింగ్ సపోర్ట్ ఎద్దులబండి తోలేవాళ్ళకి, రైతులకి తెగ నచ్చేసింది. ఈ పరికరాన్ని చూసి జనం విద్యార్థులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ డెమో ప్రాజెక్ట్ కోసం లీడ్ కాలేజ్ స్కీం కింద శివాజీ యూనివర్సిటీ నుండి రూ. 10 వేలు అందుకున్నారు. ఈ రోలింగ్ సపోర్ట్ ప్రాజెక్టుకు పేటెంట్ రైట్స్ కి కూడా అప్లై చేశారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని రాజా రాంబాపు కోఆపరేటివ్ షుగర్ మిల్లులో టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే దీన్ని రైతులందరికీ అందుబాటులో ఉంచుతామని విద్యార్థులు వెల్లడించారు.
దేశంలోని ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది ఈ సరికొత్త రోలింగ్ సపోర్ట్. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అవ్నీష్ శరన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ” ఎద్దులపై భారాన్ని తగ్గించేందుకు బండికి రోలింగ్ సపోర్ట్ ఏర్పాటుచేశారు” అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన కొన్ని క్షణాల్లోనే అది వైరల్ అయ్యింది. ఈ రోలింగ్ సపోర్ట్ ఫోటోపై ప్రతీ ఒక్కరూ పాజిటివ్ గా స్పందించారు. మానవత్వం అభివృద్ధి చెందిందంటూ ప్రశంసిస్తున్నారు.
ఇతరుల గురించి ఆలోచిస్తే ఆదరణ, అభిమానం.. శ్రమిస్తే ప్రశంసలు వస్తాయని ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు నిరూపించారు. మూగజీవాల గురించి ఆలోచించి తలపెట్టిన ఈ సారథి ప్రాజెక్ట్ విజయవంతం అవ్వాలని కోరుకుందాం. ఈ సారథి ప్రాజెక్టుతో ఎడ్ల భారాన్ని తగ్గించే రథసారథులుగా రైతులు కొత్త అవతారం ఎత్తుతారని ఆశిద్దాం. మరి ఈ సరికొత్త పరికరంతో ఎడ్ల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్న ఈ యువకులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీళ్ళు చేసిన పనిని పది మందికి షేర్ చేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం.. పారాచూట్ సాయంతో బయటపడిన పైలట్..
ఇది కూడా చదవండి: పెళ్ళి మండపంలో రెచ్చిపోయిన వరుడు.. వధువుకి లిప్ లాక్!