గత రెండెళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాని ప్రతాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ తీసుకుంటున్నా.. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల డెల్టా వేరియంట్ ప్రభావం చూపిస్తే.. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.
ఒమిక్రాన్ అంత భయంకరమైనదేమీ కాదని కొందరు, అది చాలా డేంజరని మరికొందరు చెబుతుండడంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. కరోనా ముప్పుపై ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఏ, బీ, ఆర్‌హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ పరిశోధకులు తేల్చారు.
ఇక ఓ, ఏబీ, ఆర్‌హెచ్ నెగిటివ్ గ్రూపుల బ్లడ్ గ్రూపు ఉన్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం 2,586 మంది కరోనా పేషెంట్లపై చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ దేశంలో కాలుమోపకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.