ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వారం క్రితం సబ్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు సబ్ ఇంజనీర్ విడుదల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీంతో అజయ్ భార్య అర్పిత తన బిడ్డను వెంటబెట్టుకొని అడవి బాట పట్టింది. ఆమె తన భర్తకోసం చేసిన పోరాటం ఫలించింది. అక్కడ నక్సలైట్లతో సంప్రదింపులు జరిపి వారి చెర నుంచి తన భర్తను విడిపించుకుంది. దీంతో వారంరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అక్కడి స్థానికులు ఆమె చేసిన పోరాటనికి కలియుగ సతీ సావిత్రి అంటూ మెచ్చుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే… బీజాపూర్ జిల్లా మాంకేలీ సమీపంలోని ఘట్ కేర్నీలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈనెల 11న సబ్ ఇంజనీర్ అజయ్ భూషణ్, అటెండర్ లక్ష్మణ్ తో కలసి వెళ్లారు. అక్కడ మావోయిస్టులు వారిద్దరిని కిడ్నాప్ చేశారు. మరుసటి రోజు అటెండర్ ను విడిచిపెట్టారు. కానీ సబ్ ఇంజనీర్ ని తమ చెరలోనే ఉంచుకున్నారు. ప్రభుత్వ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవటంతో ఇంజనీర్ భార్య అర్పిత తీవ్ర వేదనకు లోనైంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో తన భర్త పావులాగా మారడం ఏంటి అని తన ఆవేదనను వెల్లడించింది. తానే స్వయంగా భర్త విముక్తి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
యుగాలు వేరైనా కథ ఒక్కటే.. ఆనాడు తన భర్తకోసం యమధర్మరాజు వెంటపడితుంది ఆ సతీ సావిత్రి.. ఈనాడు తన భర్త కోసం మావోయిస్టుల వెంటబడింది ఈ సావిత్రి. అధికారుల వల్ల తన భర్త విడుదలకాడనే విషయం అర్పితకు అర్థమైంది. తానే స్వయంగా తన రెండేళ్ల బాబును వెంట బెట్టుకొని అడవిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో ఎటు వెళ్తున్నానో అనే కనీస ఆలోచన చేయకుండా తన ప్రయాణం కొనసాగించింది.
నిద్రహారాలు మరిచి భర్త ప్రాణాలను కాపాడుకోవాలని ఆమె చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎటు వెళ్తుందో తెలీదు. అక్కడ క్రూర మృగాలు ఉంటాయో? తిండి ఏంటి అనే ఆలోచన లేకుండా ఆమె ప్రయాణం సాగించింది. అలా అడవిలో మావోయిస్టులను చేరేందుకు ఆమెకు 5 రోజులు పట్టింది. అనంతరం మావోయిస్టులను కలిసిన ఆమె, వారితో తన బాధను మొర పెట్టుకుంది. చివరికి మావోయిస్టులు అదే ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి సబ్ ఇంజనీర్ అజయ్ ను ఆమెకు అప్పగించారు. తన వేదనను విని భర్త ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టడంపై మావోయిస్టులకు అర్పిత కృతజ్ఞతలు తెలిపింది. భర్త కోసం అర్పిత చేసిన ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. అర్పిత ఒక నవయుగ సావిత్రి అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. భర్త కోసం అర్పిత చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.