ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ ఉద్యోగుల కర్తవ్యం. ప్రజల కట్టే పన్నులతోనే వారికి జీతాలు వస్తున్నాయి. అయినా అవి సరిపోవన్నట్లు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తుంటారు. తమ వద్దకు వచ్చిన ప్రజలను లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంటారు. ఇచ్చే వారు ఇస్తున్నా.. ఈ అనాయ్యాన్ని ఎదిరించే వారు కొందరు ఉంటారు. దీంతో ఏసీబీని ఆశ్రయించి లంచం అడిగిన ప్రభుత్వ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తుంటారు. ఇలా అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా వారు చాలా మందే ఉన్నారు. ఇక్కడ మరో సమస్య ఏమిటంటే.. న్యాయస్థానం ఇచ్చే తీర్పులు చాలా ఆలస్యం అవుతున్నాయి. సరైన సమయంలో బాధితులకు న్యాయం జరగడం లేదు. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన ఓ ఘటన. 32 ఏళ్ల క్రితం రూ.100 లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగికి ఇటీవలే కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో ప్రాంతానికి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తి 32 ఏళ్ల ఉత్తర రైల్వేలో లోకో డ్రైవర్ గా పనిచేసి పదవీ చేశారు. రామ్ కుమార్ తివారి 1991లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అన్నీ అధికారులకు సమర్పించాడు. అయితే వారు మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాలని తెలిపారు. దీంతో వైద్య ధృవీకరణ పత్రం కోసం రైల్వే డాక్టర్ రామ్ నారాయణ్ వర్మ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో టెస్టులు చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సదరు వైద్యుడు రూ.150 డిమాండ్ చేశారు. అయితే న్యాయంగా ఇచ్చే ఈ సర్టిఫికేట్ కి కూడా డబ్బులు ఎందుకు అంటూ వైద్యుడ్ని ప్రశ్నించాడు. రూ.150 ఇస్తేనే మెడికల్ సర్టిఫికేట్ ఇస్తానని ఆయన చెప్పారు. దీంతో రామ్ కుమార్ చేసేది లేక.. తప్పని పరిస్థితుల్లో రూ.50 ఇచ్చాడు.
మిగతా రూ. 100 ఇవ్వడానికి ముందు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత రూ.100 ఇస్తుండగా ఏసీపీ అధికారులు కాపుకాసి రెడ్ హ్యాండెడ్ గా రామ్ నారాయణ్ వర్మను పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. 1991లో నమోదైన ఈ కేసు తీర్పు.. వాయిదాలు పడుతూ వస్తుంది. ఇలా 32 ఏళ్ల పాటు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసులో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి అజయ్ విక్రమ్ సింగ్ .. వర్మను దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష విధించారు. అయితే తన వయసును పరిగణలోకి తీసుకుని శిక్షను తగ్గించాలని వర్మ చేసిన అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. మరి.. 32 ఏళ్ల తరువాత కోర్టు తీర్పు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.