గత కొన్ని రోజుల కిందట ఆర్బీఐ రూ.2000 నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలో రూ.500 నోటు కూడా రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్ రూ.500 నోటు రద్దుపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో రూ.2000 నోటు రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి అవకాశం కల్పింది. ఇక సెప్టెంబర్ 30లోపు ప్రజలంతా తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని కోరింది. దీంతో ప్రజలు ఆ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల్లో బారులు తీరారు. అయితే, రూ.2000 నోటు రద్దైన నాటి నుంచి ఆర్బీఐ రూ.500 నోటు సైతం రద్దు చేస్తుందంటూ గత కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ రూ.500 నోటు రద్దుపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
గురువారం జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంలో గవర్నర్ శక్తి కాంత దాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.500 నోటు రద్దు అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. మొత్తం రూ.3.62 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని, వీటిలో దాదాపు రూ.1.82 లక్షల కోట్లు వెనక్కి వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి రూ.500 నోటు రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, ఆ నోటు రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా రూ.1000 కూడా మరోసారి తీసుకోస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంతా అవాస్తవం అంటూ కొట్టిపారేశారు. ఇలాఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.