అంతరిక్షంలోకి వెళ్తున్న ఆడవారి విషయంలో మాత్రం సమాజధోరణిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. నేటికి కూడా మహిళల విషయంలో మన సమాజంలో కొన్ని అనాగరిక ఆచారాలు, సంప్రదాయాలు అమల్లో ఉన్నాయి. వాటిని మార్చాలని ఎవరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్చడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఫలితంగా ఆడవాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కోటి ఆశలతో వివాహ బంధంలోకి ప్రవేశించిన నవవధువుకు పెళ్లైన మరుసటి రోజే దారుణమైన అవమానం ఎదురయ్యింది. వరుడి కుటుంబ సభ్యులు నవవధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు. దానిలో ఆమె ఫెయిల్ కావడంతో.. చితకబాదడమే కాక.. ఏకంగా 10 లక్షల జరిమానా కట్టాలంటూ డిమాండ్ చేశారు. ఆవివరాలు..
ఈ దారుణ సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. భిల్వారా జిల్లాకు చెందిన బాధిత మహిళకు.. బాగోర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. ఇక వారి సంప్రదాయం ప్రకారం.. కుక్డి విధానంలో నవ వధువుకు కన్యత్వ పరీక్ష చేయించారు. దానిలో ఆమె విఫలం కావడంతో.. వరుడి కుటంబ సభ్యులు షాకయ్యారు. దీని గురించి వధువును నిలదీయడంతో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. పెళ్లికి ముందు తన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు చెప్పుకొచ్చింది వధువు. దీని గురించి ఎవరికి చెప్పొద్దని తనను బెదిరించారని వెల్లడించింది. అతడి మాటలకు భయపడి.. తనపై జరిగిన దారుణం గురించి తన తల్లిదండ్రులతో సహా ఎవరికి చెప్పలేదని తెలిపింది.
ఈ విషయం విన్న వరుడు, అతడి కుటుంబ సభ్యులు.. తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెద్దలు మరింత దారుణమైన తీర్పు వెల్లడించారు. ఏకంగా వధువు, ఆమె కుటుంబానికి 10 లక్షల రూపాయల జరిమానా విధించారు. నవవధువును ఆమె పుట్టింటికి పంపడమే కాక.. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని కూడా వేధింపులకు గురి చేశారు. వారి బాధలకు తాళలేక బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి ఈ అమానవీయ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.