తన సోదరి వివాహానికి భారీ ఎత్తున కట్నకానుకలు సమర్పించి చరిత్ర సృష్టించారు ఇద్దరు సోదరులు. ఒకటి, రెండు కోట్లు కాదండీ బాబు.. ఏకంగా 8 కోట్లకు పైగానే కట్నకానుకలు అందించి.. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ఇంత భారీ మొత్తంలో కట్నం సమర్పించడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వివరాలు..
వివాహం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి అంటే ఆ ఖర్చు తడిసిమోపెడవుతుంది. మగ పెళ్లి వారు కోరే గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పలపాలవుతున్నారు. కానీ మగాళ్లు.. ఏమాత్రం సిగ్గుపడకుండా.. తమను తాము బేరం పెట్టుకుని.. అమ్ముడుపోవడానికి రెడీ అవుతున్నారు. తరాలు మారుతున్న ఈ ఆలోచనలో మార్పు రావడం లేదు. బిడ్డను ఉత్త చేతులతో అత్తారింటికి పంపాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. తమకు చేతనైనంతలో బాగానే పెట్టాలనుకుంటారు. కానీ మగ పెళ్లి వారు మాత్రం.. ఇవేం పట్టించుకోకుండా.. తాము డిమాండ్ చేసినంత ఇస్తేనే పెళ్లి అంటారు. వివాహం తర్వాత ఏమైనా బాగా చూసుకుంటారా అంటే అది లేదు. ఆ తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉంటారు.
అయితే నేటి కాలంలో తల్లిదండ్రులు కుమార్తెను, కొడుకును సమానంగా చూస్తున్నారు. ఆస్తి విషయంలో కూడా అలానే వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే కుమార్తె వివాహ సమయంలోనే తమ తాహతుకు తగ్గట్టు కట్నకానుకలు ముట్టజెబుతున్నారు. తాజాగా సోదరి పెళ్లికి.. ఇద్దరు అన్నలు భారీ ఎత్తున్న కట్నకానుకలు అందించి రికార్డు సృష్టించారు. ఆ వివరాలు..
ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లాలోని ధింగ్‌సార గ్రామానికి చెందిన అర్జున్ రామ్ మెహారియా, భగీరథ్ మెహారియాలు అనే ఇద్దరు సోదరులు.. తమ చెల్లి పెళ్లి సందర్భంగా 8 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే కట్నకానుకలు అందజేశారు. వివాహం సందర్భంగా రూ. 2.21 కోట్ల నగదుతో పాటుగా 1.105 కేజీల బంగారం, 14 కేజీల వెండి పెట్టారు. ఇవే కాక మరో రూ. 4.42 కోట్లు విలువచేసే భూమిని కానుకగా అందించారు. అంతేకాక సోదరి కోసం ట్రాక్టర్ గోధుమలు, స్కూటీతో పాటుగా మరి కొన్ని వాహనాలు, నగలను కట్నంగా అందించారు. ఆ కట్నాన్ని అందించడానికి వందలాది మంది వారితో పాటుగా వెళ్లారు. దీంతో దాదాపు రెండు కిలోమీటర్లు మేర వాహనాలు బారులు తీరాయి.
సోదరికి కట్నం అందించడానికి ఈ ఇద్దరు అన్నలు.. వందలాది కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో కళ్యాణ మంటపం వద్దకు చేరుకున్నారు. ఇలా పెళ్లి వేడుకకు కట్నకానుకలు సమర్పించడాన్ని స్థానికంగా ‘మైరా’ అంటారు. అయితే అర్జున్, భగీరథ్‌లు ఇచ్చిన మైరానే ఈ ప్రాంతంలో అతి పెద్దదిగా రికార్డు సృష్టించినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఈ ఆచారం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుందని.. సోదరి పెళ్లికి ఇలా భారీగా కట్నం అందించడం తమ కుటుంబ సాంప్రదాయం అని ఈ సోదరులు తెలిపారు.
నాగౌర్‌లో ఎన్నో ఏళ్లుగా ఈ మైరా సంప్రదాయం అమల్లో ఉంది. హిందూ సంప్రదాయ పెళ్లిలో ఇది ఒక భాగం. చెల్లెలికి ఆర్థిక భారం తగ్గించేందుకు ఆమె సోదరులు ఈ మైరాను అందజేస్తారు. ఇందులో భాగంగా సోదరి పెళ్లి వేడుకను సోదరులే దగ్గరుండి జరిపిస్తారు. అయితే తమ గ్రామంలో సోదరి వివాహానికి ఎవరు ఇవ్వనంత భారీ ఎత్తున కట్నకానుకలు సమర్పించి పెళ్లి జరిపించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. ఏకంగా రూ. 8.1 కోట్ల విలువ చేసే నగదు, బహుమతులను పెళ్లికి కట్నంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.