అదేంటి రాజకీయ నేతల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు ఉంటాయి కానీ.. ఎమ్మెల్యేకు, దొంగ మధ్య ఈ సవాళ్ల గొడవ ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అసలు ఈ సవాళ్ల గొడవ ఏంటో తెలియాలంటే.. ఈ వార్త చదవండి. రాజస్తాన్ లో ఈ సవాళ్ల పర్వం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరలవుతోంది. ఎమ్మెల్యేకు, దొంగకు మధ్య వివాదానికి కారణం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం హత్యలు, కిడ్నాపులు, లూటీలు, దొంగతనాలు వంటి 120కిపైగా కేసులు ఉన్న ఆ దోపిడీ దొంగ జగన్ గుర్జార్.. ధోల్‌పూర్‌లో కొందరు దుకాణదారులతో ఇటీవల గొడవపడి గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపాడు. దీంతో దుకాణదారులందరూ కలిసి పోలీసులకు, బారి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు ఫిర్యాదు చేశారు.
కేను నమోదు చేసుకున్న పోలీసులు ధోల్ పూర్ లోని దంగ్ ప్రాంతంతలో గుర్జార్ కోసం గాలింపు ప్రారంభించారు. తన కోసంపోలీసులు వెదుకుతున్నారని తెలుసుకున్న దొంగ.. ఎమ్మెల్యేనే తనపైకి పోలీసులను ఉసిగొల్పారని భావించాడు. ఆ వెంటనే ఎమ్మెల్యేను బెదిరిస్తూ.. ఓ వీడియో విడుదల చేశాడు. దీనిలో ఎమ్మెల్యేపై పలు సంచనల ఆరోపణలు చేశాడు. జస్వంత్ నియోజకవర్గ ఎమ్మెల్యేని హత్య చేయాలని గిరిరాజ్ తనను కోరారని, అయితే తానాపని చేయలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. గుర్జార్ ఆరోపణలను ఎమ్మెల్యే కొట్టిపడేయడంతో ఈసారి ఆ బందిపోటు దొంగ మరో వీడియోను విడుదల చేస్తూ.. తనను ఎదుర్కొనే దమ్ముంటే భద్రతా సిబ్బంది లేకుండా రావాలని సవాల్ విసిరాడు.
ఇందుకు బదులుగా ఎమ్మెల్యే మరో వీడియో విడుదల చేస్తూ.. తాను పోలీసుల రక్షణ తీసుకోనని, దమ్ముంటే తన ఇంటికి రావాలని ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు, ఆ తర్వాత ఈ వివాదంపై మీడియాతో మాట్లాడుతూ.. గుర్జార్ లాంటి లోకల్ గూండాలకు తాను భయపడబోనన్నారు. తనను తుపాకితో కాలుస్తానని అతడు బెదిరించాడని, కానీ తన దగ్గర కూడా ఓ తుపాకి ఉందని, అదేమీ బొమ్మ తుపాకి కాదన్న సంగతిని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, దొంగల మధ్య చోటు చేసుకున్న ఈ సవాళ్ల పర్వం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.