పెళ్లంటే నూరేళ్ల పంట.. బంధుమిత్రులు సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుపుతుంటారు. సాధారణంగా పెళ్లి వేడుకల్లో బారాత్ సందర్భంగా డీజే సౌండ్స్ తో చిన్నా.. పెద్దా డ్యాన్స్ తో హురెత్తిస్తుంటారు. ఈ సందర్భంగా ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి.. మరికొన్నిసార్లు విషాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా పెళ్లి వేడుకలో అందరితో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి స్టేజ్ పైనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజస్థాన్ పాలిలో అబ్దుల్ సలీమ్ పఠాన్ అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలో ఫిజికల్ ట్రైనర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. అబ్దుల్ తన భార్య, పిల్లలతో కలిసి మేనకోడలి వివాహవేడుకకు హాజరయ్యాడు. శనివారం వివాహం జరగాల్సి ఉండగా.. సంగీత్ వేడుక శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలో స్టేజ్ పై అబ్దుల్ సలీం పఠాన్ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. హుషారెత్తించే మ్యూజిక్ కి అబ్దుల్ డ్యాన్స్ చేస్తుండగా మిగతా వారు ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. అలా స్టేజ్ పై కంటిన్యూగా డ్యాన్స్ చేస్తున్న అబ్దుల్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
స్టేజ్ పై కుప్పకూలిపోయిన అబ్దుల్ ని బంధువులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ ని పరీక్షించిన వైద్యులు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. దాంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. అప్పటి వరకు తమతో ఆనందంగా ఉన్న అబ్దుల్ సలీమ్ పఠాన్ అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేపోతున్నారు. గతంలో కూడా పెళ్లి వేడుకలపై డ్యాన్స్ చేస్తూ పలువురు కుప్పకూలిన ఘటనలు వెలుగు చూశాయి. కొంతమంది డీజే సౌండ్స్ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.