భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శనివారం ఉదయం 11.56 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-54 రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ54 రాకెట్ ద్వారా మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. ఇందులో 960 కేజీల బరువు కలిగిన ఓషన్ శాట్-3 తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాల్లో భూటాన్ కు చెందిన భూటాన్ శాట్ అనే శాటిలైట్ కూడా ఉంది. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం.
ఈవోఎస్ సిరీస్‌లో ఓషన్ శాట్-3 అనేది ఆరో ఉపగ్రహం కాగా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 56వ రాకెట్ ప్రయోగం. ఈవోఎస్-06 ఉపగ్రహం భూపరిశోధనలు, సముద్ర గర్భంలోని విషయాలను, వాతావరణంలోని తేమ అంచనా, తుఫానులను పసిగట్టడం వంటి వాటి అధ్యయనం కోసం ఉపయోగపడుతుంది. పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం ద్వారా మన దేశానికి చెందిన తైబోల్ట్–1, తైబోల్ట్–2, ఆనంద్, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్ –2 పేరుతో నాలుగు శాటిలైట్లను స్పేస్ లోకి ప్రయోగించారు. ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించిన ఎనిమిది ఉపగ్రహాల్లోని తైబోల్ట్-1, తైబోల్ట్- 2 అనే ఉపగ్రహాలు హైదరాబాద్‌కు చెందినవి కావడం విశేషం. ఈ ఉపగ్రహాలు రేడియో కార్యకలాపాలకు సంబంధించిన పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లనున్నాయి. హైబర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం.. మీథేన్ లీకులు, భూగర్భంలో దాగి ఉన్న చమురు నిల్వలు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేంగుకు దోహదపడుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.