డాక్టర్లకు ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్లైనా సరే ఈరోజుల్లో బానే సంపాదించుకుంటున్నారు. తక్కువ ఫీజు తీసుకునే డాక్టర్లు కూడా ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. అలాంటిది పెద్ద ప్రైవేటు ఆసుపత్రి ఉన్న ఈ డాక్టర్ మాత్రం తోపుడు బండి మీద పానీపూరీ అమ్ముకుంటోంది. ఈమె మాత్రమే కాదు ఈమెలా మిగతా డాక్టర్లు కూడా తోపుడు బండ్ల మీద పానీపూరీలు, టీ అమ్ముతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి?
రోడ్డు మీద ఒక లేడీ డాక్టర్ పానీపూరీ బండి పెట్టుకుని పానీపూరీ అమ్ముకుంటోంది. ఆ బండి మీద ప్రైవేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. ఈమె ఒక్కరే కాదు.. ఈమెతో పాటు పని చేసే సిబ్బంది కూడా పక్కనే ఒక టీ బండి పెట్టుకుని టీ అమ్ముకుంటున్నారు. ఒకరిద్దరు కాదు.. వేలాది మంది వైద్యులు రోడ్డు మీద ఇలా వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ కనిపించారు. సొంతంగా హాస్పిటల్స్ ఉంటాయి, క్లినిక్ లు ఉంటాయి. జనాలు చికిత్స చేయించుకోవడానికి రావడం లేదా అంటే ఆ పరిస్థితి లేదు. మరి వైద్యులకు ఆదాయం సరిపోవడం లేదా అంటే అదీ లేదు. మరి ఎందుకు వేలాది మంది వైద్యులు ఇలా రోడ్డు మీద తోపుడు బండి పెట్టుకుని ఛాయ్, పానీపూరీ వంటివి అమ్ముకుంటున్నారు. అసలు ఏం జరిగింది?
ఇలా డాక్టర్లంతా చిరు వ్యాపారులుగా మారడానికి ఒక కారణం ఉంది. రాజస్థాన్ జైపూర్ లోని ప్రైవేటు వైద్యులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సికార్ జిల్లాకు చెందిన ఒక మహిళా వైద్యురాలు తన ఆసుపత్రికి తాళం వేసి ఇలా తోపుడు బండి పెట్టుకుని పానీపూరీలు అమ్ముతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. మిగతా ప్రైవేటు వైద్యులు కూడా ఈమె బాటలోనే తమ ఆసుపత్రులకు తాళం వేసి పానీపూరీ, ఛాయ్ అమ్ముతూ కనిపించారు. కొందరైతే కోడి గుడ్ల స్టాల్స్ పెట్టుకుని నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ స్టాల్స్ పై ప్రైవేటు డాక్టర్ అని రాసి ఉంది. హాస్పిటల్ సిబ్బంది కూడా ఇలానే తోపుడు బండి మీద ఏవో ఒకటి అమ్ముతూ నిరసన తెలియజేశారు.
దీనికి కారణం రాజస్థాన్ ప్రభుత్వం ‘రైట్ టూ హెల్త్’ అనే బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం ప్రజలు ఎవరైనా సరే ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా ఏ ఆసుపత్రిలో అయినా అత్యవసర వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఉచితంగా వైద్యం చేస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రైవేటు వైద్యులంతా నిరసన బాట పట్టారు. ఈ బిల్లును ఎలాంటి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. ర్యాలీలు చేపట్టారు. చట్టం పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు రాజాస్థాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఇంకా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రైవేటు వైద్యుల బృందాలు నిరసనలో పాల్గొనేందుకు వస్తున్నట్లు సమాచారం. అయితే ప్రైవేటు వైద్యులపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రే ప్రైవేటు వైద్యులు తనను కలవాలని చెప్పినా ఎలాంటి స్పందన లేదని.. ఆదివారం విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేసినా వైద్యులు రాలేదని అన్నారు.
నీరసం వస్తే తగ్గించే డాక్టర్లే ఇలా నిరసన చేస్తే హౌ.. ఆ హౌ? అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ‘ఆరోగ్యం ప్రజల హక్కు’ అంటూ రైట్ టూ హెల్త్ అనే బిల్లు తీసుకురావడం మంచిదే అని.. అత్యవసర సమయంలో డబ్బులు చెల్లించలేని పేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులు లేవని చెప్పి కనీసం పేదవాడిని ఆసుపత్రిలో చేర్చుకోని పరిస్థితి. ఏ ప్రమాదమో జరిగి చావు బతుకుల్లో ఉంటే అత్యవసర వైద్యం చేయడం మానేసి బేరాలు ఆడే డాక్టర్లు ఉంటారని, అలాంటి డాక్టర్ల వల్ల పేదల ప్రాణం పోకూడదనే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని, మంచిదే అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.