దేశ అమ్ముల పొదిలో అనేక అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సుఖోయ్-30 యుద్ధ విమానం. ఇప్పుడు ఈ యుద్ధ విమానంలో పర్యటించనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె ఓ పర్యటనలో భాగంగా ఇందులో ప్రయాణించనున్నారు.
సువిశాల గగనతలం, సుదీర్ఘమైన సాగరతీరం ఉన్న భారత్‌కు పొరుగు దేశాల నుండి రక్షణ కూడా అంతే అవసరం. ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్తు సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవడానికి నిరంతరం కొత్త శక్తియుక్తులను కూడగట్టుకోవడం ఆవశ్యం. ఇప్పటికే దేశ అమ్ముల పొదిలో అనేక అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి. యుద్ధ ట్యాంకర్లు, సుఖోయ్, తేజస్, రాఫెల్‌తో పాటు పలు క్షిపణులున్నాయి. అయితే సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము ప్రయాణించనున్నారు. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా నిలిచారు.
అస్సాంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సుఖోయ్-30 యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించనున్నారు. ఏప్రిల్ 6-8 తేదీల్లో ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముర్ము పాల్గొననున్నట్లు రాష్ట్రపతి భవన అధికారిక ప్రతినిధి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె శనివారం అనగా ఈ నెల 8న తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్-30 MKI యుద్ధ విమానం ఎక్కనున్నారు. 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు. తాజా పర్యటనలో భాగంగా ఈ నెల 7న కజిరంగా జాతీయ పార్కులో జరగునున్న గజ్ ఉత్సవ్-2023 వేడుకల్లో ముర్ము పాల్గొననున్నారు. అనంతరం గువహటిలో జరిగే మౌంట్ కాంచనగంగ సాహసయాత్ర- 2023ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా గౌహతిలో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి ఆమె హాజరుకానున్నారు.