గ్యాస్ ధరల విషయంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు ఉపశమనం కలిగించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా గ్యాస్ ధరలు, సీఎన్జీ ధరలు తగ్గుతాయని కేంద్రం వెల్లడించింది.
గ్యాస్ ధరల మార్గదర్శకాలకు సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా భారతీయ క్రూడ్ మార్కెట్లో గ్యాస్ ధరలు అనుసంధానం కానున్నాయి. భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో సహజ వాయువు ధరను పది శాతం ఉంచాలని నిర్ణయించింది. గ్యాస్ ధర స్థిరంగా ఉండేందుకు కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీంతో నెలవారీగా గ్యాస్ ధరలను నిర్ణయించనున్నారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ఉత్పత్తిదారులకు, ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాన నగరాల్లో సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు కిలో వద్ద రూ. 5 తగ్గుతాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇది 10 శాతం తగ్గింపుతో సమానమని అన్నారు.
ఈ కొత్త సంస్కరణలు డొమెస్టిక్ వినియోగదారుల కోసం పీఎన్జీ గ్యాస్, రవాణా కోసం సీఎన్జీ గ్యాస్ ధరలు గణనీయమైన తగ్గుదలకు దారి తీస్తాయని పేర్కొంది. ఈ గ్యాస్ ధరలు తగ్గడం వల్ల ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించి.. దేశీయ విద్యుత్ రంగానికి సహాయపడతాయని పేర్కొంది. ఈ కొత్త విధానం వల్ల ఓఎన్జీసీ, ఆయిల్ కంపెనీలకు సుదీర్ఘ కాలం పాటు అదనపు పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం లభిస్తుంది. దీని వల్ల గ్యాస్ ఉత్పత్తి పెరిగి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాల మీద ఆధారపడడం అనేది తగ్గుతుందని పేర్కొంది. అందుకే గ్యాస్ ధరలు తగ్గుతాయని వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ గ్యాస్ ధరలు 2014లో భారత ప్రభుత్వం ఆమోదించిన కొత్త డొమెస్టిక్ మార్గదర్శకాలు 2014 ప్రకారం నిర్ణయించబడ్డాయి.
భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో గ్యాస్ ధర 10 శాతం ఉంటుందని, నెలవారీ ప్రాతిపదికన ఈ ధరల ప్రకటన ఉంటుందని పేర్కొంది. తమ నామినేషన్ బ్లాక్స్ నుంచి ఓఎన్జీసీ మరియు ఆయిల్ కంపెనీలు ఉత్పత్తి చేసే గ్యాస్ కోసం ఏపీఎం (అడ్మినిస్టర్డ్ ప్రైజ్ మెకానిజం) అనేది నియంత్రణలో ఉంటుందని తెలిపింది. కొత్త బావుల నుంచి ఉత్పత్తి చేయబడిన గ్యాస్ లేదా ఓఎన్జీసీ మరియు ఆయిల్ నామినేషన్ ఫీల్డ్స్ లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే గనుక ఏపీఎం ధర కంటే 20 శాతం ప్రీమియం అనేది అనుమతించబడుతుందని కేంద్రం పేర్కొంది. దేశంలో ప్రాథమిక శక్తి మిశ్రమంలో గ్యాస్ యొక్క వాటాను 2030 కల్లా 6.5 శాతం నుంచి 15 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం పేర్కొంది. ఈ సంస్కరణలు గ్యాస్ వినియోగాన్ని మరింత విస్తరించడానికి.. అలానే ఉద్గార తగ్గింపు, నికర సున్నా లక్ష్య సాధనకు సహాయపడుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ కొత్త సంస్కరణపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.