కంచే చేను మేస్తే అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ విషయాన్ని అక్షర సత్యం చేశాడు పంజాబ్ కి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.., అత్యంత హీన చర్యకి పాల్పడ్డాడు. నాలుగు కోడి గుడ్లు దొంగతనం చేస్తూ.., అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన పంజాబ్ లోని ఫతేఘర్ సాహిబ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దొంగల ఆట కట్టించేది పోలీసులే. వారున్నారనే ధైర్యంతోనే పబ్లిక్ ఎలాంటి టెన్షన్ లేకుండా బతికేస్తుంటారు. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీసులకు మంచి పేరే వచ్చింది. కానీ.., పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీస్ వ్యవస్థ మొత్తానికి మచ్చ తీసుకొచ్చే పని చేశాడు. ఫతేఘర్ సాహిబ్ పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రీత్ పాల్ సింగ్ ఆ రోజు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యాపారి రిక్షాలో కోడిగుడ్ల ట్రేలు పెట్టుకొని అటుగా వచ్చాడు. ఏదో పని పడి రోడ్డు పక్కగా రిక్షాను ఆపాడు. అక్కడే వున్న హెడ్ కానిస్టేబుల్ ప్రీత్ పాల్ సింగ్ దీని అంతటిని దూరం నుండి గమనిస్తూనే ఉన్నాడు. వ్యాపారి కాస్త పక్కకి వెళ్ళగానే మెల్లిగా ట్రేలో చేతులు పెట్టి నాలుగు గుడ్లు బయటకు తీసి జేబులో వేసేసుకున్నాడు. అంతలో వ్యాపారి ఆ రిక్షా దగ్గరికి రావడంతో.. హెడ్ కానిస్టేబుల్ ఏమి తెలియనట్టు అక్కడ నుండి మెల్లగా జారుకున్నాడు. అంతే కాదు.., వ్యాపారికి అనుమానం వచ్చిందేమో అనుకుని అక్కడే ఓ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. కానీ.., హెడ్ గారి దొంగతనం భాగోతం అంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. దొంగలను పట్టుకోవలసిన పోలీసు కోడి గుడ్ల దొంగతనం చేయడం ఏమిటని దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీనితో హెడ్ కానిస్టేబుల్ ని విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏదేమైనా కరోనా సమయంలో కూడా కష్టజీవి కడుపు కొట్టాలని చూసిన ఈ పోలీస్ కి మంచి గుణపాఠం ఎదురైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.