Noujisha: చేతిలో డిగ్రీలు, మెడలో తాళి, వంటింటికి పరిమితం చేసిన అత్తామామ, భర్తకు వేరే మహిళతో ఎఫైర్…. ఇక, తనకు ఆత్మహత్యే దారనుకుంది. కానీ ఒక్క ఆలోచన ఆమె మైండ్‌ను మార్చేసింది. తాను చనిపోతే తన ఏడాది వయసున్న బాబుకు దిక్కెవరు అనుకుంది. ఆలోచన మార్చింది. ఇప్పుడు ఐఏఎస్ అయ్యింది. ఏడాది క్రితం ఏ బావి దగ్గర అయితే చనిపోవాలి అనుకుందో.. అదే బావి దగ్గరకు పోలీస్ యూనిఫార్మ్‌లో వచ్చింది. ఏ కొడుకు కోసమైతే తన నిర్ణయాన్ని మార్చుకుందో ఐదేళ్ల తర్వాత వచ్చి ఆ కొడుకుని హత్తుకుంది. ఎవరి వల్ల అయితే చికటి గదిలో కూర్చుని ఏడ్చిందో.. వాళ్ల కళ్ల ముందుకు పోలీసుగా ప్రత్యక్షమయ్యింది. జీవితం అంతా అయిపోయింది అనుకున్న ఆమె.. ఇప్పుడు సక్సెస్ అయ్యింది.. తనే.. నౌజీష.
పెళ్లితో మారిన జీవితం :
చనిపోవాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఆ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే చిన్నా చితక వాటికి ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ.. ఇదివరకు జీవితం ఎలా ఉన్నా సర్దుకుపోయేవారు. జాబ్ లేకున్నా.. భర్త కొట్టినా, లవ్ ఫెయిల్ అయినా.. సర్దుకుపోయేవారు. కానీ తెగించి ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కొందరైతే.. తల్లిదండ్రుల పిల్లలు గుర్తుకు వచ్చి వెనకడుగు వేసిన వాళ్లు మరికొందరు. ఆ కోవలోకే చెందుతారు నౌజీష. 32ఏళ్ల నౌజీష ఇప్పుడు సింగిల్ పేరెంట్. టార్చర్ పెట్టే భర్త నుంచి విముక్తి పొందింది. నౌజీషది కేరళ కోజికోడ్‌లోని ఓ గ్రామం. ఎంసీఏ పూర్తి చేసి ఓ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా జాబ్ చేస్తోంది. ఏడాది పాటు జాబ్ చేసిన ఆమెకు పెళ్లి సంబంధం వచ్చింది. వివాహం తర్వాత తన ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంది.. ఇదే విషయం కాబోయే భర్త, అత్తమామలతో చెప్పగా.. వారూ అందుకు అంగీకరించారు. దాంతో సంతోషంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది నౌజీష.
పెళ్లి అయిన కొత్తలో నౌజీషను భర్త, అత్తామామలు చాలా బాగా చూసుకున్నారు. రెండు నెలలు గడిచే సరికి అందరి రంగులు బయట పడ్డాయి. జాబ్ మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడు. మానేయకపోతే పుట్టింటికి వెళ్లిపోవాలని చెప్పేశాడు. ఇంకేంటి?… పతియే ప్రత్యక్ష దైవం.. ఆయన చెప్పిందే వేదం అనుకుంది. చేతిలోని డిగ్రీలను అటకమీద పడేసింది. జాబ్ మానేసి వంటింటికి పరిమితం అయ్యింది. భర్తకు నచ్చినట్టే అన్ని చేసినా.. ఫలితం లేదు. ప్రతి చిన్న విషయానికి తిట్టడం కొట్టడం మొదలు పెట్టాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అత్తామామలు ఇంట్లోంచి బయటకు వెళ్లనిచ్చేవాళ్లు కాదు. జైల్లో ఉన్నట్లు అయ్యింది ఆమె బతుకు. అప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది నౌజీష.
ప్రతియే ప్రత్యక్ష నరకం.. ఆత్మహత్యాయత్నం..
బిడ్డ పుట్టాక అయినా భర్తలో మార్పు వస్తుంది అని భావించింది నౌజీష. కానీ, తాను అనుకున్నట్లు జరగలేదు. భర్త మాత్రం మారలేదు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. నౌజీషకు టార్చర్ చూపించాడు. నిత్యం కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. బహూషా భర్త ఎఫైర్ల గురించి తెలియకూడదనే ఆమెను వంటింటికి పరిమితం చేసి ఉంటాడు అనుకుంది నౌజీష. అత్తామామలకు చెప్పినా లాభం లేదు. వారు కూడా సూటి పోటి మాటలంటూ హింసించారు. అమ్మానాన్నలకు చెప్పి వారిని నొప్పించడం నాకిష్టం లేక తనలో తానే కుమిలిపోయానంటోంది నౌజీష. జాబ్ వదిలేసింది. భర్తకు వేరే మహిళతో ఎఫైర్, అత్తామామల టార్చర్.. వీటన్నింటిని భరించలేకపోయింది. క్షణికావేశంలో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఓ రాత్రి ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరికి వెళ్లింది. ఒక్కసారిగా ఆమె కాళ్లూ, చేతులు వణకడం మొదలయ్యింది.
ఒళ్లంతా చెమటలు, ఆ క్షణం తాను ఓ బిడ్డకు అమ్మనన్న విషయం గుర్తొచ్చింది. తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లు, రాత్రింబవళ్లూ కష్టపడి చదివిన డిగ్రీలు.. ఇవన్నీ గుర్తొచ్చాయి. తన కోసం ఇంత మంది ఉన్నప్పుడు ఎందుకు చావాలి.. అంటూ అడుగు వెనక్కి వేసింది. గుండె నిండా ధైర్యం నింపుకొని ఇంటికి చేరుకుంది. మరుసటి రోజే తన కొడుకుని తీసుకొని పుట్టింటికెళ్లిపోయింది. సంతోషమైన జీవితంలోంచి పెళ్లి అనే బంధంలోకి వెళ్లి నరకం చూసింది. అత్తింట్లో వారందరికీ వండి పెట్టినా.. తనకు మాత్రం బుక్కెడన్నం పెట్టే వారు కాదు. చెంపదెబ్బలు తినింది. మాటలు పడింది. గర్భవతి అని కూడా చూడకుండా హింసించినా ఓర్చుకుంది. అన్ని బంధాలను తెంచుకుని అత్తింటి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత నౌజీష ఏం చేసింది? IPSగా ఎలా మారింది?
మళ్లీ కొత్త జీవితం..
కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లిన నౌజీషకు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకున్న నౌజీష.. విడాకుల కోసం అప్లై చేసింది. మరోవైపు లెక్చరర్‌గా తిరిగి ఉద్యోగంలో చేరింది. అంతలోనే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాగైనా పోలీసు ఉద్యోగం సంపాదించాలని నిశ్చయించుకుంది. ఉద్యోగం చేస్తూనే.. పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంది. 2018లో తొలి ప్రయత్నంలో రిటెన్ టెస్ట్‌లో పాసైనా.. ఫిజికల్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యింది. అయినా పట్టువదలకుండా 2020లో సక్సెస్ అయ్యింది. విమెన్ సివిల్ పోలీస్ ఆఫీసర్స్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో 141వ ర్యాంక్ వచ్చింది. దీంతో2021 ఏప్రిల్‌లో శిక్షణలో చేరింది. ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలందుకుంది.
గ్రాడ్యుయేటింగ్ పరేడ్ పూర్తిచేసుకున్న అనంతరం యూనిఫామ్‌తో వచ్చి తన కొడుకును గుండెలకు హత్తుకొని భావోద్వేగానికి గురైంది. ఏ బావి దగ్గర అయితే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుందో అదే బావి దగ్గరకు యూనిఫామ్‌తో సక్సస్‌ఫుల్ వుమెన్‌గా వచ్చింది. భర్త కొడుతుంటే.. ఒకప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి అంటే భయపడేది నౌజీష. కానీ ఇప్పుడు ఆ స్టేషన్‌కే పోలీస్ ఆఫీసర్‌గా వెళ్లింది. తనలా ఎంతోమంది మహిళలు గృహహింసను మౌనంగా భరిస్తున్నారని.. అలాంటి వాళ్లు మిత్ర హెల్ప్‌లైన్ నెంబర్ 181కు కాల్ చేయవచ్చని చెప్పింది. అంతేకాదు.. పెళ్లే జీవిత లక్ష్యం కాదు.. ఆర్థికంగానూ మన కాళ్లపై నిలబడగలిగేలా తయారుకావాలి అని ప్రతి మహిళను మోటివేట్ చేస్తోంది. మరి, నౌజీష సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరితే.. విద్యార్థులకు రూ.5వేల నజరానా!