రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు చేసే విషయంలో కొంతమంది నేతలు నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. పైగా మహిళా నేత గురించి మాట్లాడేటప్పుడు మరింత తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని పట్టుకుని మంత్రిగా పనిరావు.. సినిమాలో నటిగా చేసుకోవచ్చు అంటూ హేళన చేసి మాట్లాడారు. దాంతో ఆ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. వివరాలు.. కేరళలో కరోనా కేసుల ఉధృతిపై మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జి ఓ సీనియర్ జర్నలిస్ట్‌కు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జినుద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనికిరారని అభిప్రాయపడ్డారు. సినీ నటి అయ్యేందుకు మాత్రమే ఆమెకు అర్హతలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన అసిస్టెంట్‌ను రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి చేశారని వ్యాఖ్యానించారు. మంత్రి వీణా పరువుకు భంగం కలిగించేలా మరిన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఆడియో రికార్డును జర్నలిస్టు తన పత్రికకు సంబంధించి ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహిళా మంత్రినుద్దేశించి పీసీ జార్జి చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాలు అభ్యంతరం తెలిపాయి.
మాజీ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. పీసీ జార్జిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కేరళ హైకోర్టు న్యాయవాది బీహెచ్ మన్సూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేరళ డీజీపీ ఆదేశాల మేరకు ఆయనపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 509(మహిళ పరువుకు భంగం కలిగించడం), 354 ఏ, కేపీ యాక్ట్ 124 తదితర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.మంత్రిపై పీసీ జార్జి చేసిన అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు సీనియర్ జర్నలిస్ట్ నందకుమార్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.