ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలను పలకరించుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. మహారాష్ట్ర అకోలాలో గురువారం మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. స్వాతంత్య్ర పోరాటయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలానే స్థానికుల మనోభావాలు దెబ్బతీశారని రాహుల్ గాంధీపై బాలాసాహెబంచి శివసేన నాయకురాలు వందన సుహాస్ డోంగ్రే గురువారం థానే నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 500, 501 కింద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు నమోదు చేశారు. స్వాతంత్రం రాక ముందు సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాపణ లేఖ రాశారని.. అలా రాసి మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి నాయకులకు ద్రోహం చేశారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Maha | Balasahebanchi ShivSena’s (Shinde faction) Vandana Suhas Dongre filed a Police complaint against Rahul Gandhi over his remarks on Savarkar; states, he “defamed the freedom fighter & hurt sentiments of locals.” Police registered a non-cognisable offence u/s 500 & 501 IPC pic.twitter.com/vqnUL8uAve
— ANI (@ANI) November 18, 2022
‘సార్ నేను మీకు అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నాను’ అని రాసి సంతకం చేసి సావర్కర్ బ్రిటిష్ వారికి సాయం చేశారని, భయంతో లేఖ రాశారని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శివసేన పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. తమ ప్రాంత నేతలను కించపరిస్తే ఊరుకునేది లేదని, తమ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని శివసేన పార్టీ నేతలు హెచ్చరించారు. వీర్ సావర్కర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అన్న విషయాన్ని గుర్తుచేశారు. దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా తప్పుబట్టారు.