గాల్వన్ లోయలో చైనాతో రెండేళ్ల క్రితం జరిగిన హింసాత్మక ఘర్షణలో బీహార్ జవాన్ జై కిషోర్ సింగ్ అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన తండ్రికి అవమానం జరిగింది. పోలీసులు ఆయనను ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆయనపై దూషిస్తూ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ అమర జవాన్ తండ్రి చేసిన తప్పు కూడా పెద్దది కాదు. అతను చేసిందల్లా రెండేళ్ల క్రితం చనిపోయిన తన కొడుకు గురించి ఆలోచించడం.
అసలు ఏం జరిగిదంటే? బీహార్ లోని వైశాలి జిల్లా జండాహాలో కజారి బుజుర్గ్ గ్రామానికి చెందిన రాజ్ కపూర్ సింగ్ కొడుకు జై కిషోర్ సింగ్ 2020లో గాల్వన్ లోయలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. అయితే తన కొడుకు జ్ఞాపకార్థం గత ఏడాది ఫిబ్రవరిలో సింగ్ కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ స్థలంలో అమర జవాన్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మారక చిహ్న ఆవిష్కరణ కార్యక్రమానికి అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత స్మారక చిహ్నం చుట్టూ గోడ కూడా కట్టారు. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన భూమిలో అక్రమంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారని చెప్పి పోలీసులు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి వెళ్లారు.
యుద్ధంలో అమరుడైన సైనికుడిని కన్న తండ్రి అన్న స్పృహ లేకుండా.. కనీసం జాలి కూడా లేకుండా టెర్ర*రిస్టులా ఆయన్ని ఈడ్చుకుంటూ బయటకు లాక్కొచ్చారు. తాను చేసిన తప్పేంటి అని అడిగేలోపు ఆయన మీద పోలీసులు చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే రాజ్ కపూర్ సింగ్ అరెస్టుకి నిరసనగా స్మారక చిహ్నం వద్ద స్థానికులు ఆందోళనలు చేపట్టారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తమ చర్యలను సమర్ధించుకున్నారు. ప్రభుత్వ భూమితో పాటు తన భూమిలో అనుమతులు లేకుండా సైనికుడి విగ్రహాన్ని నిర్మించారని రాజ్ కపూర్ సింగ్ ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే రాజ్ కపూర్ సింగ్ ను అరెస్ట్ చేశామని అన్నారు.
ఫిర్యాదు ఆధారంగా రాజ్ కపూర్ పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే డీఎస్పీ తమ ఇంటికి వచ్చి విగ్రహాన్ని తొలగించమని ఆదేశించారని, అందుకోసం 15 రోజుల గడువు కూడా ఇచ్చారని ఆర్మీలో పని చేస్తున్న నంద కిషోర్ అన్నారు. ఈయన అమర జవాన్ జై కిషోర్ సింగ్ సోదరుడు. తమకు డిఎస్పీ 15 రోజులు గడువు ఇస్తే.. రాత్రికి రాత్రి జండాహా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి తమ ఇంటికి వచ్చి తన తండ్రిని అరెస్టు చేశారని అన్నారు. తన తండ్రిపై చేయి చేసుకోవడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా తన తండ్రిని కొట్టారని ఆరోపించారు. అర్ధరాత్రి వచ్చి ఒక తీవ్ర*వాదిని అరెస్ట్ చేసినట్టు తన తండ్రిని అరెస్టు చేశారని వాపోయారు. మరి అమర జవాన్ తండ్రికి జరిగిన అవమానంపై మీ అభిప్రాయమేమిటి? పోలీసుల తీరుపై మీ రియాక్షన్ ఏమిటో కామెంట్ చేయండి.
Galwan valley martyr’s father being dragged by @bihar_police @yadavtejashwi @NitishKumar @SpVaishali pic.twitter.com/oJjUnqtQET
— Anish Singh (@anishsingh21) February 26, 2023