ఈ మద్య కాలంలో రాకెట్ కన్నా వేగంగా దూసుకువెళ్తున్నాయి పెట్రోల్, డీజిల్ ధరలు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఒకదశలో తమ వాహనాలు పక్కకు పెట్టి.. ఆర్టీసీ బస్సులు మరియు రైళ్ళలో ప్రయాణం చేస్తున్నారు. దసరా రోజు కూడా పెట్రోల్ ధరల నుంచి దేశ ప్రజలకు ఊరట లభించడం లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో పెట్రోల్ ఫ్రీగా ఇస్తామంటే జనాల పరిస్థితి ఎంటో ఆలోచించండి.. రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోతారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పెట్రోల్ బంక్ ఓనర్ ఏకంగా మూడు రోజులపాటు వచ్చిన కస్టమర్లందరికీ ఫ్రీ పెట్రోల్ ఇచ్చాడు. తమ ఇంట లక్ష్మీదేవి రూపంలో ఆడిపిల్ల పుట్టిందని.. ఆ సంతోషంతోనే ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. వివరాల్లోకి వెళితే.. బేతుల్ జిల్లాకి చెందిన దీపక్ సైనాని అనే వ్యక్తి, తన చెల్లెలికి అక్టోబర్ 9న ఆడపిల్ల పుట్టింది. లక్ష్మీ దేవి రూపంలో తమ ఇంట కోడలు అడుగు పెట్టిందని.. ఆ సంతోషాన్ని వినూత్న రూపంలో తెలపాలని భావించాడు దీపక్. అంతే మేనకోడలు పుట్టిన సంబరంలో దీపక్ సైనాని పెట్రోల్ బంకుకు వచ్చిన కష్టమర్లందరికీ పెట్రోల్, డీజిల్ ఫ్రీ అని ప్రకటించాడు.
నవరాత్రుల వేళ అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితం అని ప్రకటించాడు. అయితే రూ.100లకు పెట్రోల్ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200-500 రూపాయలకు పెట్రోల్ కొన్నవారికి 10 శాతం పెట్రోల్ ఫ్రీగా అందించానని స్థానిక మీడియాలు వెల్లడించాడు. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిపోతున్న ఇంధనం ధరలతో సతమతమవుతున్న సామాన్యులు ఈ మంచి ఆఫర్ ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావించి.. పెదవి విరిచే ఈ రోజుల్లో, ఇంత విలువైన బహుమతి మేకోడలికి అందించిన అతని ఉన్నతమనసును చాటిచెబుతోంది.