దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయి. దీంతో వాహనదారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ఇంధన ధరలను భరించలేక వాహనాలను తగలబెట్టిన ఘటనలు కూడా మన రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ అధిక ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. పెట్రోల్ మూల ధర కంటే ప్రభుత్వాలు విధించే పన్ను అధికంగా ఉండడం ప్రజల ఆగ్రహానికి కారణవుతుంది.
కాగా జీఎస్టీ పరిధిలోకి ఇంధన ధరలను చేర్చాలనే డిమాండ్ బలంగా ఉంది. దీంతో ఈ విషయంపై సాధ్యాసాధ్యలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 17న లక్నోలో సమావేశం అవ్వనుంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ప్రస్తుతం ఉన్న ధరలు భారీగా తగ్గనున్నాయి. పెట్రోల్ 75 రూపాయలకు, డీజిల్ 68 రూపాయలకు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు నిజమై పెట్రోల్ ధర తగ్గితే మధ్యతరగతి ప్రజలపై భార కాస్త తగ్గనుంది.