కొంతమందికి జంతువులతో అటాచ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో కుటుంబ సభ్యుల్లా ఫీలవుతుంటారు. వాటికి ఏమై నా అయితే తట్టుకోలేరు. కుక్కలు కూడా యజమానికి ఏమైనా అయితే తట్టుకోలేవు. యజమాని కనిపించకపోయినా, చనిపోయినా ఏడుస్తాయి. ఇక సొంత పిల్లల్లా చూసుకున్న కుక్కలకి ఏమైనా అయితే మనుషులు ఇంకా ఎక్కువ కన్నీళ్ళు పెట్టుకుంటారు. కుక్కల మీద ప్రేమతో కేక్ కట్ చేసి వాటి పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తారు. అవి చనిపోతే మనుషులకి చేసినట్టే అంత్యక్రియలు జరుపుతారు.
తాజాగా ఒడిశాకి చెందిన ఓ కుటుంబం ఓ శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. 17 ఏళ్ళుగా వారితో పాటు కలిసి జీవించిన శునకం ప్రాణాలు కోల్పోయింది. గజపతి జిల్లాలోని పార్లాఖేముందీ ప్రాంతంలో తున్ను గౌడ కుటుంబం ఈ శునకాన్ని అల్లారుముద్దుగా చూసుకునేవారు. దీనికి అంజలి అనే పేరు కూడా పెట్టారు. అంత అపురూపంగా చూసుకున్న శునకం చనిపోవడంతో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు. మనిషి చనిపోతే ఎలా అయితే ఏడుస్తారో అంతలా ఈ శునకం చనిపోయినందుకు వెక్కి వెక్కి ఏడ్చారు.
చనిపోయిన శునకానికి ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. పూల మాలలతో అలంకరించిన కారులో మృతదేహాన్ని ఊరేగించారు. బ్యాండు మేళం ఏర్పాటు చేసి మరీ ఊరేగింపు కొనసాగించారు. ఓ వైపు వాన పడుతున్నా లెక్కచేయకుండా ఘనంగా శునకానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి పెంపుడు కుక్కకి అంత్యక్రియలు జరిపిన ఈ కుటుంబంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.