వైద్య శాస్త్రంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అరుదైన విశేషాల గురించి మనం నిత్యం చూస్తుంటాం. వైద్యశాస్త్రంలో అరుదైన మరో అద్భుతం జరిగింది. కరెంట్ షాక్ తో రెండు చేతులూ కోల్పోయిన వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిన మరొక వ్యక్తి చేతులను అతికించి కొత్త జీవితం ప్రసాదించారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బసవణ్ణ గౌడ అనే వ్యక్తికి 2011 జులైలో హైటెన్ష్ విద్యుత్ తీగలు తగిలి రెండు చేతులూ కాలిపోయాయి. దీంతో అతడిని చికిత్స కోసం బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లగా, వారు బెంగుళూరుకు రిఫర్ చేశారు. బళ్లారి వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించారు. అక్కడ బసవణ్ణ గౌడకు రెండు చేతులు మోచేతి వరకు తొలగించారు. పదేళ్లుగా అలానే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే రెండు చేతులు కోల్పోయిన బసవణ్ణ.. 2016లో కొచ్చిలోని అమృత ఆస్పత్రి హ్యాండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ కు దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబరులో తీవ్ర అనారోగ్యంతో ఇదే ఆస్పత్రిలో కొట్టాయంకి చెందిన సాజన్ మాథ్యూ(25) అనే యువకుడు చేరాడు. కొన్ని రోజుల తర్వాత అతడు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.
అవయవదానం కోసం వైద్యులు అతడి తల్లిదండ్రులను సంప్రదించగా వారు అంగీకరించారు. యువకుడి బ్లడ్ గ్రూప్ బసవణ్ణ గౌడకు సరిపోవడంతో సెప్టెంబరు 25న చేతుల మార్పిడి శస్త్రచికిత్స చేపట్టారు. డాక్టర్ సుబ్రమణ్యం అయ్యర్ నేతృత్వంలోని వైద్యుల బృందం 14 గంటలు వ్యవధిలో న్యూ ఆక్సిజన్ క్యారియర్ హెమో-2 లైఫ్ విధానంతో ఈ చికిత్స చేసినట్లు ఆస్పత్రి రీకన్ స్ట్రక్టివ్ సర్జరీ చీఫ్ డాక్టర్ మోహిత్ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ తీసుకుంటున్న బసవణ్ణ ఈ కొత్త చేతులతో స్వయంగా పని చేసుకోగలరని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన చికిత్సపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.