నెమలిని ఇష్టపడని వారుండటరు. ముఖ్యంగా అది డ్యాన్స్ చేస్తుంటే చూడాలని అందరూ అనుకుంటారు. అంత అందంగా నాట్యం చేస్తుంది నెమలి. అలాంటి నెమలి ప్రవర్తిస్తున్న తీరుకు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగిందంటే..!
జాతీయ పక్షి నెమలిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందమైన రూపం, అంతకంటే అందమైన దాని నాట్యం చూడముచ్చటగా ఉంటాయి. అందుకే పార్కులు, అడవుల్లో ఎక్కడైనా నెమళ్లు కనిపిస్తే వెంటనే ఆగిపోతుంటాం. చేతిలో ఫోన్ ఉంటే అందులో నెమలిని బంధిస్తాం. అయితే ఇక్కడో గ్రామంలో నెమలి దగ్గరకు ప్రజలు వెళ్లడం కాదు.. వాళ్ల వద్దకే అది వస్తోంది. బిహార్లోని నౌహట్టాలో తియురా గ్రామం. అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకు ఒక కారణం నెమలి. ఊరివాళ్ల ఆనందానికి, నెమలికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఆ ఊరికి దగ్గర్లోని కైమూర్ కొండ అడవిలో ఉంటే ఓ నెమలి రోజూ ఆ గ్రామానికి వస్తోంది.
ఆ నెమలికి ఊళ్లోని పిల్లలు చిన్ను, మున్ను, కుల్బుల్ అని పేర్లు పెట్టారు. అంతలా ఆ పిల్లలు నెమలికి కనెక్ట్ అయ్యారు. రోజూ ఉదయం అడవిలో నుంచి గ్రామానికి వచ్చే నెమలి.. ఊరంతా తిరుగుతుంది. మళ్లీ సాయంత్రం అడవిలోకి వెళ్లిపోతుంది. ఊళ్లోని పిల్లలతో ఆడుకుంటుంది. పిల్లలు కూడా దాన్ని ఏమీ అనరు. ఆ నెమలి అప్పుడప్పుడు రెక్కలు విప్పి డ్యాన్స్ చేస్తుంది. దీన్ని అక్కడివారు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. గ్రామ ప్రజలతో అది బాగా కనెక్ట్ అయిపోయింది. వాళ్ల ఇళ్లలోకి వెళ్లి ఏదైనా పెడితే, నచ్చితే తింటుంది. చాలా మంది గ్రామస్తులు నెమలికి భోజనం పెట్టాకే తామూ తింటారు. దీన్ని బట్టి నెమలి అంటే వారికి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
ఇతర పెంపుడు జంతువుల మాదిరిగానే నెమలినీ గ్రామస్తులు ప్రేమగా చూసుకుంటున్నారు. గ్రామంలోని వీధికుక్కలు, పిల్లులు నెమలిని చూసి భయపడుతున్నాయి. అది ఎక్కడ తమను పొడుస్తుందోనని దూరంగా పారిపోతున్నాయి. ఇక, ఊరి జనం కూడా రోజూ ఉదయం అది ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. దీని గురించి తెలిసి పొరుగు ఊర్లలోని ప్రజలు కూడా చూసేందుకు వస్తున్నారు. ఇళ్లలో తిరుగుతూ, పిల్లలతో ఆడుకుంటున్న నెమలిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాని వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.