అధికారంలో ఏ పార్టీ ఉన్నా.., ఢిల్లీ రాజకీయాలు ఒక్క పట్టాన ఎవ్వరికీ అర్ధం కావు. పదవులు ఖాయం అనుకున్నవారికి మొండిచేయి చూపించడం, అసలు రేసులో లేని వారిని తీసుకొచ్చి.. సింహాసనంపై కూర్చోబెట్టడం ఇక్కడ తరుచుగా జరిగే ప్రక్రియే. ఈ పొలిటికల్ క్యాలిక్యూలేషన్స్ కారణంగానే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కబోతుందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ.., ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఈ విషయంలో ఇంకా ఆలశ్యం చేయడం మంచిది కాదన్న అభిప్రాయానికి మోదీ, అమిత్ షా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయం అయిపోయింది. అయితే.., ఈసారి అన్ని రాష్ట్రాలకు కేంద్రం కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండేలా పక్కా ప్రణాళిక రచించారట. ఇప్పుడు ఈ నిర్ణయమే పవన్ కి పదవి రావడానికి కారణం కాబోతున్నట్టు తెలుస్తోంది. 2019 నుండి కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. దీంతో.., ఏపి నుండి ఒకరికి అవకాశం ఇవ్వాలని కమలం పెద్దలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం బీజేపీకి లోక్ సభ సభ్యులు లేరు. రాజ్యసభ నుండి మాత్రం జీవీఎల్ ఒక్కరి పేరే వినిపిస్తోంది. మిగతా వారు కొంతమంది ఉన్నా వారంతా పార్టీకి విధేయులు కాదు. టీడీపీ నుండి తప్పక అవసరార్ధం పార్టీలో చేరిన వారే. కాబట్టి జీవీఎల్ కి పోటీ లేదు. కానీ., టెక్నీకల్ గా ఇక్కడ ఓ సమస్య ఉంది. జీవీఎల్ రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తోంది ఏపీ నుండి కాదు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో.., ఇప్పుడు ఆయనకి పదవి కట్టబెట్టినా ఏపీలో కమలానికి కొత్తగా వచ్చే లాభం ఏమి ఉండదు. ఇలాంటి సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కనుక కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాలలో బలపడవచ్చు అన్నది బీజేపీ ప్లాన్. పవన్ క్రేజ్ తెలంగాణలో ఓట్లను తెప్పించగలదు. జీ.హెచ్.ఎం.సి ఎన్నికల్లో ఈ విషయం ఋజువైంది కూడా. ఇక ఏపీలో జగన్ ఛరీస్మాని తట్టుకుని నిలబడగలిగే నాయకుడు ఒక్క పవన్ మాత్రమే అని బీజేపీ నమ్ముతుంది. పైగా.., పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తే కాపు ఓట్లను దక్కించుకోవచ్చు అన్నది కమలనాధుల ఆలోచన. మరి.., మంత్రి పదవి ప్రతిపాదనకి పవన్ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.