గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిస్క్, ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ఈ క్రమంలో పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలోకి వచ్చిన చార్టర్డ్ విమానంలో కరోనా కలకలం రేగింది. తాజాగా ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ ఛార్టెడ్ విమానంలో 125 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు విమానాశ్రయ డైరెక్టర్ వీకే సేథ్ వెల్లడించారు. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. ఈ విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.
మిలన్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అమృత్ సర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 19 మంది చిన్నారులు. వారిని మినహాయించి పెద్దలందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ తేలడంతో అప్రమత్తమైన అధికారులు వారిని క్వారెంటైన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు ముందు అంబులెన్స్‌లు బారులు తీరాయి.