చాలా మంది ప్రయాణికులు చిల్లర విషయంలో గొడవ పడుతుంటారు. పెద్ద నోటు ఇచ్చినా, చిన్న నోట్లు ఇచ్చినా రూపాయి, 2 రూపాయల దగ్గర చిల్లర ఇవ్వాల్సి వస్తే కొంతమంది కండక్టర్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. దిగేటప్పుడు ఇస్తాలే అని వెనుక రాసి ఇస్తారు. చాలా మందికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది. అయితే మీకు తెలుసా? చిల్లర ఇవ్వకపోతే కోర్టులో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చునని.
కండక్టర్ కి చిల్లర ఇచ్చి సహకరించండి అని ఆర్టీసీ బస్సుల మీద రాసి ఉంటుంది. అయితే అందరూ రోజూ చిల్లర తెచ్చుకోలేరు. దీంతో అటు కండక్టర్లకు, ఇటు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. దీన్ని అదునుగా తీసుకుని కొంతమంది కండక్టర్లు చిల్లర ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. చిల్లర దిగేటప్పుడు ఇస్తానని చెప్పి టికెట్ వెనకాల రాస్తారు. అయితే ఒక రూపాయి, రెండు రూపాయలే కదా అని కొంతమంది లైట్ తీసుకున్నా కొంతమంది అస్సలు రాజీపడరండోయ్. కండక్టర్ బ్యాగ్ పిండి మరీ వసూలు చేస్తారు. అయితే ‘నా దగ్గర చిల్లర లేదు, నేనివ్వను పో’ అని అంటే మాత్రం ఇదిగో ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్క రూపాయి చిల్లర తిరిగి ఇవ్వలేదని ఒక ప్రయాణికుడు ఒక కండక్టర్ పై కోర్టులో కేసు వేశాడు. అంతే రూపాయితో పోయేదానికి ఆ కండక్టర్ వేలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
2019లో రమేష్ నాయక్ అనే వ్యక్తి బీఎంటీసీ బస్సు ఎక్కి శాంతి నగర్ నుంచి మెజెస్టిక్ బస్ డిపోకి ప్రయాణం చేస్తున్నాడు. కండక్టర్ రూ. 29 టికెట్ ఇచ్చాడు. రమేష్ నాయక్ రూ. 30 చెల్లించాడు. అయితే కండక్టర్ మిగిలిన రూపాయి చిల్లర ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన అతను తనకు రూ. 15 వేలు పరిహారంగా ఇప్పించాలని వినియోదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. దానికి బెంగళూరు కోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. రమేష్ నాయక్ కి రూ. 2 వేలు పరిహారం చెల్లించాలని బీఎంటీసీని కోర్టు ఆదేశించింది. అలానే రూ. 1000 లీగల్ ఫీజు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బును 45 రోజుల్లోగా చెల్లించకపోతే ఏడాదికి రూ. 6 వేల రూపాయల వడ్డీ చెల్లించాలని కోర్టు హెచ్చరించింది.
అయితే ఇది చాలా చిన్న విషయమని బీఎంటీసీ పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఇది చిన్న విషయం కాదని.. ఒక రూపాయి అయినా, ఒక పైసా అయినా అది వినియోగదారుడి కష్టార్జీతమని.. అతని సొమ్ము అతనికి తిరిగి ఇవ్వకపోవడం దొంగతనమే అవుతుందని కోర్టు తెలిపింది. అదండీ విషయం. ఆలస్యమైనా గానీ రూపాయి చిల్లర ఇవ్వలేదని బీఎంటీసీపై కోర్టులో కేసు వేసి రూపాయితో పాటు అదనంగా రూ. 1999 పొందాడు. దీని వల్ల లాభమో, నష్టమో తెలియదు కానీ ఈగో సేటిస్ఫేక్షన్ అయితే ఉంటుంది. దాని కంటే ఎక్కువగా చిల్లర తిరిగివ్వని కండక్టర్లకు భయం అనేది ఉంటుంది. మరి రూపాయి చిల్లర తిరిగి ఇవ్వని కండక్టర్ పై, ఆర్టీసీపై కేసు వేసిన రమేష్ నాయక్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.