ఈ మద్య మనుషులు పెంపుడు జంతువులు, పక్షులకు పుట్టిన రోజు, సీమంతం, వివాహ కార్యక్రమాలు ఘనంగా జరిపిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని కరేలీలో ఓ విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు వ్యక్తులు తమకు ఎంతో ఇష్టమైన పక్షులకు సంప్రదాయ బద్దంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకకు బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల వాళ్లను పిలిచి బాజా భజంత్రీల నడుమ పెళ్లి తంతు జరిపించారు. అంతేకాదు ఒక బుల్లి వాహనంపై వీధుల్లో బారాత్ కూడా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని పిపారియా గ్రామానికి చెందిన రామస్వరూప్ పరిహార్ అనే వ్యక్తి కొంత కాలంగా మైనా పక్షిని తన సొంత కూతురిగా పెంచుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన బాదల్ లాల్ విశ్వకర్మ అనే మరో వ్యక్తి ఓ చిలుకను తన సొంత కొడుకులా పెంచుకుంటున్నాడు. ఇలా ఈ ఇద్దరు తమ పక్షుల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో వాటికి వివాహం జరిపించాలన్న ఆలోచన వచ్చింది. అంతే వాటికి జాతకాలు చూపించి మరీ మైనా- చిలుకల కు ఆదివారం పెళ్లి ముహూర్తం ఖాయం చేశారు.
ఆదివారం గ్రామ పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో బాజా భజంత్రీల మద్య చిలుక-మైనా పక్షుల వివాహం ఘనంగా జరిపించారు. ఆ తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు. అంతే కాదు పెళ్లైన పక్షుల కోసం ప్రత్యేకంగా చిన్నపాటి జీపు పై పంజరాన్ని ఏర్పాటు చేసి అందంగా అలంకరించి ఊరేగించారు. చిలుక-మైనా ల వివాహాం చూడటానికి పెద్ద ఎత్తున జనాలు రావడం విశేషం. కొంతమంది ఇదేం విడ్డూరం.. పక్షుల పెళ్లిళ్లు కూడా ఇంత ఘనంగా చేస్తారా అంటూ నోరెళ్లబెట్టారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.