‘అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు’ అనేది ఓ సామెత. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అత్త.. కోడలు ఉన్నా సరే తను గుణవంతురాలినేనని నిరూపించుకుంది. కోడలికి తల్లిలా మారి ఆమె భవిష్యత్తుకు మార్గం చూపించింది. కరోనా సమయంలో కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోయిన కోడలిపై మంచిమనసుతో ఆదరించడమే కాకూండా దగ్గరుండి మరో పెళ్లి చేశారు. అందుకోసం వారు 60 లక్షల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఆ తల్లిదండ్రుల పెద్ద మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్, ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ ప్రకాశ్ తివారీ కొడుకు.. ప్రియాంక్ తివారి గతేడాది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలోకి పోయింది. ప్రియాంక్ తివారీకి భార్య రిచా, తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉన్నారు. ప్రియాంక్ మరణంతో వీరు అనాథలైపోయారు. కానీ వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రియాంక్ తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచించారు. రిచాను కోడలుగా కాకుండా.. సొంత కూతురుగా భావించారు. ఆమెకు మరో పెళ్లి చేయాలనుకున్నారు. అందుకు రిచాను ఒప్పించి, మంచి వ్యక్తిని చూసి అక్షయ తృతియ రోజున అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. నాగ్‌పూర్ నివాసి వరుణ్ మిశ్రాతో రిచా వివాహం జరిపించారు. ఆ వేడుకలో అత్తగారు కోడలను కుమార్తెగా భావించి కన్యాదానం చేశారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: కూతురు కోసం 30 ఏళ్లుగా మగాడి వేషధారణలో తల్లి!
అంతేకాదు.. రిచాకు భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావించిన ఆ తల్లిదండ్రులు రూ.60 లక్షల విలువైన బంగ్లాను బహుమతిగా రాసిచ్చారు. ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. “తమ కోడలిని సొంత కూతురిగా భావించామని చెప్పారు. రిచా, మనవరాలు అన్యల భవిష్యత్తు కోసం దగ్గరుండి పెళ్లి చేశామని, నాగ్‌పూర్‌లో తన కొడుకు ప్రియాంక్ కొన్న బంగ్లాను కూడా వారికే కానుకగా ఇచ్చామని చెప్పారు”. పెళ్లి తర్వాత అన్య కూడా తన తల్లితో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లింది. కోడలికి తల్లిదండ్రులుగా మారి.. దగ్గరుండి పెళ్లి చేసిన రిచా అత్తమామలను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. వీరి ఆలోచన ఎంతోమందికి ఆదర్శం అంటూ ప్రశంసిస్తున్నారు. అత్త అంటేనే.. శత్రువుగా భావించే కోడళ్లున్న ఈ రోజుల్లో ఇలాంటి అత్తమామలు కూడా ఉన్నారన్నదానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియాజేయండి.