ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే ఎమోషన్స్ కి గురై విచక్షణ కోల్పోయి ఎన్నో అనార్థాలకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడి చేయడమే కాదు.. చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. ఓ జవాన్ తన సహ జవాన్లను కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.
గుజరాత్ లో డిసెంబర్ 1,5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లకు సిద్దం చేస్తున్నారు. మణిపూర్ కి చెందిన సీఆర్ పీఎఫ్ బెటాలియన్ కు చెందిన జవాన్లను ఎన్నికల విధులు నిర్వహించేందుకు గుజరాత్ లోని పోర్ బందర్ కి 25 కిలో మీటర్ల దూరంలో ఒక పునారావా కేంద్రంలో ఉన్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన కోసం శనివారం రాత్రి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కొంత మంది జవాన్ల మద్య వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో జవాన్ల మద్య మాటా మాటా పెరిగిపోవడంతో కానిస్టేబుల్ ఇనౌచౌ సింగ్ అనే జవాన్ తన వద్ద ఉన్న ఏకే 47 తో కాల్పులు జరిపాడు.. దాంతో ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ చోరాజిత్, రోహికానా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తుక్డా గోసా గ్రామం వద్ద చోటు చేసుకుంది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేందుకు జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు పోర్ బందర్ కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఉన్నతాధికారులు.