పాకిస్థాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. భారత్ లోకి రెండుసార్లు ప్రవేశించిన ఈ విమానం దాదాపు 10 నిమిషాల పాటు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు లేవు. ఇరుదేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదాలు, పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితులలో పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్(పీఐఏ)కు చెందిన ఒక విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఈ విమానం భారత్‌లో దాదాపు 10 నిమిషాల పాటు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే-248 విమానం మే 4 రాత్రి 8 గంటల సమయంలో ఒమన్ రాజధాని మస్కట్ నుంచి పాకిస్థాన్‌కు బయలుదేరింది. ఇది లాహోర్ లోని అలామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో చేసేదేం లేక పైలట్ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో భారీ వర్షం ఉండటంతో దారితప్పిన పైలట్ విమానాన్ని భారత గగనతలంలోకి తీసుకొచ్చాడు. ఆ విమానం దాదాపు 13,500 అడుగుల ఎత్తులో బధానా పోలీస్ స్టేషన్ పరిధి గగనతలం మీదుగా భారత్‌లోకి ప్రవేశించింది. అనంతరం 7 నిమిషాల పాటు భారత్‌లో ప్రయాణించాక తిరిగి పాక్‌లోకి వెళ్లింది.
అనంతరం కాసేపటికే ఆ విమానం మళ్లీ భారత్‌లోకి ప్రవేశించింది. ఈసారి ౩ నిమిషాల పాటు ప్రయాణించి పంజాబ్‌లోని లఖా సింఘ్వాలా హిథార్ గ్రామం మీదుగా తిరిగి పాక్ లోకి ప్రవేశించి ముల్తాన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానం దాదాపు 23,000 అడగుల ఎత్తులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. విమానం దారితప్పిన ఘటనకు సంబంధించి ఉపగ్రహ చిత్రాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Pakistan airlines plane entered Indian airspace, stayed for 10 minutes and travelled 125 kmhttps://t.co/zmEXwGdPpp#PakistanAirlines #PIA #Boeing777 pic.twitter.com/K6aqr3Ji8x
— Zee Business (@ZeeBusiness) May 7, 2023