శరీరంలో ఏ లోపం లేకపోయినా.. కావాల్సినవి అన్ని సమకూర్చి పెట్టే తల్లిదండ్రులున్నా.. మనలో చాలా మంది జీవితంలో ఏ లక్ష్యం లేకుండా గడిపేస్తుంటారు. మరి కొందరు లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.. కానీ వాటిని చేరుకునే ప్రయత్నం చేయరు. అలాంటి వారందరికి స్ఫూర్తిగా నిలిచే కథనాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం.
చిన్నప్పుడే ఆ యువతిని తల్లిదండ్రులు వదిలేశారు. భిక్షమెత్తుకునే దంపతులు ఆ చిన్నారని చేరదీశారు. వారితో పాటు భిక్షాటనకు తీసుకెళ్లారు. కానీ ఆ చిన్నారికి చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది. దేవుడు ఆమె మోర విన్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆ అనాథను చేరదీసింది. విద్యాబుద్ధులు నేర్పింది. కట్ చేస్తే.. గతంలో ఎక్కడైతే తాను భిక్షాటన చేసిందో.. ఇప్పుడే అదే చోట ఓ కేఫ్ ని విజయవంతంగా నడిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె సక్సెస్ స్టోరీ ఎందరికో ఆదర్శంగా నిలవడమే కాక ప్రశంసలు పొందుతుంది. ఆ వివరాలు..
బిహార్ రాష్ట్రానికి చెందిన జ్యోతిని ఆమె తల్లిదండ్రులు బాల్యంలోనే పట్నా రైల్వే స్టేషన్ లో వదిలేశారు. భిక్షాటన చేసే దంపతులు చిన్నారిని చేరదీసి.. తమతో పాటు అడుక్కోడానికి తీసుకెళ్లేవారు. అప్పుడప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఏరుకుని, దాన్ని అమ్మి అలా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేది. అయితే జ్యోతికి బాల్యం నుంచి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. బాగా చదువుకుని.. వృద్ధిలోకి రావాలని బలంగా కోరుకునేది. ఇలా ఉండగా ఓ స్వచ్ఛంద సంస్థకు జ్యోతి ఆశ గురించి తెలిసింది. దాంతో వారు జ్యోతిని తమ ఆశ్రమంలో చేర్చుకుని.. చదువు చెప్పించారు. మెట్రిక్యూలేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ఉపేంద్ర మహారథి ఇనిస్టిట్యూట్‌లో మధుబని పెయింటింగ్స్‌లో శిక్షణ తీసుకుని, పెయింటింగ్ వేయడం కూడా నేర్చుకుంది.
ఐతే ఇంతటితో జ్యోతి సంతృప్తి చెందలేదు. జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని తపించేది. ఆమె ఆశయానికి తగ్గట్టు ఒక సంస్థలో కేఫ్ నడిపే ఉద్యోగం వచ్చింది. రోజంతా కేఫ్ నడిపి, ఖాళీ సమయాల్లో ఓపెన్ స్కూల్ లెర్నింగ్ ద్వారా చదువుకుంటోంది. నేడు జ్యోతి తన సొంత సంపాదనతో అద్దె ఇంట్లో ఉంటోంది. మార్కెటింగ్ రంగంలో కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని కలలు కంటోంది. తల్లిదండ్రులు వదిలేయడంతో అనాథగా మారని ఓ ఒంటరి ఆడపిల్ల సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. జ్యోతి కథ తెలిసిన వారు.. ఆమె జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.