దేశంలో కామాంధుల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. వారి కామ కోరికలు తీర్చుకోవడం కోసం వయసుతో సంబంధం లేకుండా చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు. పోనీ, ఇంట్లో ఉంటే సురక్షితమా! అంటే.. అదీ కాదు.. ఒంటరిగా ఉంటున్న వారిని టార్గెట్ చేసుకొని ఇళ్లలోకి చొరబడి మరీ అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఒక కేసులో ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. నచ్చిన వ్యక్తులతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోతే అది మోసం చేసినట్లు కాదని తీర్పిచ్చింది.
రాను.. రాను.. సహజీవనం కల్చర్ పెరిగిపోతోంది. పెళ్లి కాకుండానే యువతీయువకులు వారికి నచ్చిన వ్యక్తులతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో పెళ్లయ్యే లోపే అన్నీ అయిపోతున్నాయి. పోనీ, తరువాత పెళ్లి చేసుకుంటున్నారా అంటే.. అది జరగట్లేదు. మోసపోయాం, మోసం చేశారు అంటూ జంటలలో ఎవరో ఒకరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈ కోవకు చెందిందే ఈ వార్త. ఒరిస్సా, నిమపారకు చెందిన ఓ యువతి ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం భువనేశ్వర్ తీసుకెళ్లి ఆమెతో కొన్ని రోజులు సహజీవనం కూడా చేశాడు. అయితే కొన్ని రోజుల అనంతరం ఉన్నట్టుండి ఒకరోజు ఆమెను వదిలి పరారయ్యాడు.
దీంతో యువతి సదరు వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, సహజీవనం పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు జిల్లా కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా దిగువ న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో అతడు ఒరిస్సా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసిందున దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని తీర్పు చెప్పింది. అలాగే మహిళను బెదిరించవద్దని ఆదేశించిన న్యాయస్థానం, కేసు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. సహజీవనం కల్చర్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.